Monday, July 30, 2012

విశాఖ సంస్కృత సభకు స్వాగతం !!!

ప్రియ సంస్కృత సోదరీ సోదరులందరికీ సాదరం హార్దికం ఆహ్వానం!!!
 
ప్రియ సహోదరులారా, 
ఆగస్ట్ నెల 19 వ తేదీ నాడు ఆంధ్రప్రదేశ సంస్కృత అధ్యాపక సంఘం విశాఖపట్టణంలో రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహిస్తున్నది.  

ఆగస్ట్ 19 వ తేదీ ఆదివారం కావడం, ఆ మరుసటి రోజు అనగా ఆగస్ట్ 20 వ తేదీ రంజాన్ పండుగ సందర్భంగా సెలవు కావడం వలన రాష్ట్రంలోని నలుమూలలనుండి మన సంస్కృత సహోదరులందరూ సభకు విచ్చేసి మరల విశ్రాంతిగా తమ తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు తగినంత సమయం ఉంటుందనే ఉద్దేశంతో ఆరోజును సమావేశానికి తగిన 
రోజుగా భావించి ఆ నాడు సభను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకొనడం జరిగింది. 

అందువలన ఈ సభకు మీరందరూ తప్పక విచ్చేసి మన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసినదిగా కోరుతున్నాము.  సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు తమ పేరు, ఊరు, పని చేస్తున్న కళాశాల, మొబైల్ నంబరు, ఈ మెయిల్ ఐడి తెలియజేసి తప్పక రిజిస్ట్రేషన్ చేసుకొన వలసినదిగా  కోరుచున్నాము.

ఉదయం  08.30 గంటలకు సభ ప్రారంభమౌతుంది. (08.30 నుండి 10.20 వరకు) మొదటి సమావేశంలో మన సంఘం సాధించిన విజయాలు, ప్రగతిని మన నాయకులు నివేదిస్తారు.  పిమ్మట మనం వివిధ స్థాయిలలో ఎదుర్కొంటున్న వివిధ సమస్యల గూర్చి చర్చలు ఉంటాయి.  పిమ్మట భవిష్యత్తులో మన కార్య ప్రణాళికలు ఎలా ఉండాలో నిర్ణయించుకుంటాము.
ఇలా భూత వర్తమాన భవిష్యత్తులలో మన స్థితిని గూర్చిన సమీక్ష  మొదటి సమావేశంలో జరుగుతుంది. 

(10.30 నుండి 11.30 వరకు) రెండవ సమావేశంలో రాబోయే మన క్రొత్త పాఠ్య పుస్తకం ఏ విధంగా ఉంటే బాగుంటుందో సూచనలను, సలహాలను ఇవ్వడం, స్వీకరించడం, వివరించడం జరుగుతుంది.  అలాగే మన ప్రశ్నపత్రం ఏ విధంగా ఉంటే విద్యార్థి మరింత ఆసక్తిగా సంస్కృతం చదివేందుకు ఇష్టపడతాడో చర్చిస్తాము.  
మన చర్చల సారాంశాన్ని మన నాయకులు తరువాత పాఠ్యపుస్తక నిర్మాణ కమిటీకి నివేదించి సాధ్యమైనంత వరకు మన ఆకాంక్షల మేరకు క్రొత్త పాఠ్య పుస్తకం విడుదల అయ్యేందుకు కృషి చేస్తారు.   

(11.40 నుండి 01.00 వరకు) మూడవ సమావేశంలో విశాఖపట్నంలోని ప్రముఖ విద్యాసంస్థల అధినేతలు ముఖ్య అతిథులుగా విచ్చేస్తారు.  వారిని సభకు పరిచయం చేసిన పిమ్మట వారికి మనం విద్యాపరంగా సామాజికంగా మరియు ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమస్యలను నివేదిస్తాము.  వారిని ప్రతిస్పందించ వలసిందిగా కోరుతాము. 

పిమ్మట 01.00 నుండి 02.00 వరకు మధ్యాహ్న భోజన విరామం ఉంటుంది.

(02.00 నుండి 03.00 వరకు) నాల్గవ సమావేశంలో మన సంఘానికి సంబంధించిన రాష్ట్ర స్థాయి కార్యవర్గం ప్రకటించబడుతుంది.  ఈ కార్యవర్గం ఒక సంవత్సరానికి లేదా మరుసటి సమావేశం వరకు మాత్రమే పరిమితమై ఉంటుంది.
(03.00 నుండి 04.00 వరకు) ఐదవ సమావేశంలో సమారోపోత్సవం జరుగుతుంది.  దీనికి ఆంద్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి శ్రీ జార్జ్ విక్టర్ గారు విచ్చేసి ప్రసంగించడమే కాకుండా మన సంఘంలోని పెద్దలను ఉచిత రీతిన సత్కరిస్తారు.  

ఇది మనం జరపబోయే సమావేశం యొక్క సంక్షిప్త స్వరూపం.

మన కార్యక్రమం జరగబోయే వేదిక
శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళ్యాణ మండపం, ఎం. వి. పి. కాలనీ, రైతు బజారు ఎదురుగా, విశాఖపట్నం.
విశాఖపట్నం బస్సు స్టాండ్ నుండి 4 కిలోమీటర్ల దూరం.  ఆటో ఛార్జ్ 30 లేదా 35  ఇవ్వవచ్చు.
విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి 6 కిలోమీటర్ల దూరం. ఆటో ఛార్జ్ 50 లేదా 60 ఇవ్వవచ్చు.
ఈ రెండు స్థలాలనుండి వేదిక చెంతకు బస్సు నంబరు 900 ఎక్కి రావచ్చు.  
శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాల నుండి వచ్చే సంస్కృత సోదరులు బస్సు స్టాండ్ వరకు వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇసకతోట జంక్షన్ లో దిగితే అక్కడి నుండి ఒక కిలోమీటర్ దూరంలోనే మన వేదిక ఉంటుంది. 

సోదరీ సోదరులందరూ మా ఆహ్వానాన్ని అంగీకరించి తప్పక రాగలరని మరల మరల విజ్ఞప్తి చేస్తూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము.  

ఇట్లు

పెన్మెత్స పెద్దిరాజు, అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ సంస్కృత అధ్యాపక సంఘం, విశాఖపట్నం
మరియు
గండి మన్మథ రావు, కార్యదర్శి,  ఆంధ్రప్రదేశ్ సంస్కృత అధ్యాపక సంఘం, విశాఖపట్నం
E Mail - apsla.visakha@gmail.com