Saturday, March 23, 2013

ఆశ్రయం యొక్క ప్రాధాన్యత..



మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ మీడియెట్  స్థాయిలో సంస్కృతాన్ని బోధిస్తున్న అధ్యాపకులకు ఎందుకు సరైన ప్రాధాన్యత లభించటం లేదు అనే ప్రశ్నకు మన పూర్వీకులు చెప్పిన సుభాషితం సరైన సమాధానంగా కనిపిస్తోంది...



"అనర్ఘమపి మాణిక్యం హేమాశ్రయమపేక్షతే /
వినాశ్రయం న శోభంతే పండితా వనితా లతాః//"


ఎంతటి విలువైన మాణిక్యానికైనా బంగారం ఆశ్రయంగా ఉన్నపుడే అది శోభిస్తుందట.  నిజమే కదా.  అదే విధంగా, పండితులైనా, స్త్రీలైనా, పూలతీగెలైనా ఆశ్రయం ఇచ్చేవారు, ఆలంబనగా నిలిచేవారు ఉంటేనే శోభిస్తార(య)ట.  

కాళిదాసుకు అంతటి పేరు ప్రఖ్యాతులు లభించాయంటే దానికి కారణం ఆయనకు ఆశ్రయం ఇచ్చిన విక్రమార్కుడే.  
అష్టదిగ్గజాలుగా పేరుగాంచిన అల్లసాని పెద్దనాదులను మనం ఈరోజు కూడా స్మరించుకుంటున్నామంటే అందుకు ఆంధ్రభోజుడు సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని పేరు గాంచిన శ్రీకృష్ణదేవరాయలు అందుకు పూర్తిగా బాధ్యుడు.

అందువలన ఆనాడు మాణిక్యం వంటి పండితులకు బంగారం వంటి మహారాజులు ఆశ్రయంగా నిలిచారు.  ఆ రాజ్యాలు పోయినా వారి కీర్తి మాత్రం ఈనాటికి కూడా నిలిచే ఉంది.  
కాని, ఈనాడు అటువంటి మహారాజులు ఏరీ?  మహా ధనవంతులు అయినవారందరూ మహారాజులు కాలేరు.  రాజులు కానే కారు వీరు కేవలం బరువును కొలిచే తరాజులు మాత్రమే. 

 అందువల్ల మిత్రులారా, చింతించకండి.  

సాంబారును వడ్డించే గరిటెకు ఆ సాంబారు రుచి తెలుస్తుందని మనం భ్రమించడం మానివేద్దాం.  
గంధం కట్టెలు మోసినంత మాత్రాన గాడిదకు దాని సుగంధం ఆనందం కలిగిస్తుందని భావించడం మన తప్పు.

"ఉద్ధరేదాత్మనాత్మానం."