Friday, February 17, 2012

౨౦౧౧ ఏప్రిల్ ౨౪ సమావేశం


౨౦౧౧ సంవత్సరం ఇంటర్ బోర్డ్ "స్పాట్ మూల్యాంకనం" ముగిసిన తరువాత విశాఖ అప్సలా 
సంస్కృత బంధువులందరికీ విందు ఏప్రిల్ ౨౪వ తేదీ విందు ఏర్పాటు చేసింది.

("సభాసింహం" శ్రీ పిళ్లా రమణమూర్తి గారు.)

ఈ పిళ్లా రమణమూర్తి గారి సౌజన్యంతో ఈ విందును భారతీయ విద్యా భవనంలో ఏర్పాటు చేయడం జరిగింది.

(గురువర్యులు శ్రీ అక్కుబొట్ల శర్మ గారితో రాంబాబు గారు, పోలా ఉమామహేశ్వర రావు, శ్రీ మన్మథ రావు గారు, శ్రీనివాసకృష్ణ, సాగర్.)
విశ్వవిద్యాలయంలో చదివి ఈనాడు విశాఖలో సంస్కృతం బోధిస్తున్న నేటి తరానికి చెందిన 
సంస్కృత అధ్యాపకులకు దాదాపు అందరికీ గురుస్థానంలో ఉన్న శ్రీ అక్కుబొట్ల శర్మ గారు ఈ సమావేశానికి 
గౌరవ అధ్యక్షులుగా విచ్చేసి ఈనాడు సమాజానికి సంస్కృతం యొక్క అవసరం ఎంత ఉన్నదో వివరించారు.

( ప్రసంగిస్తున్న శ్రీ జగన్నాథం అన్న గారు )
( ప్రసంగిస్తున్న శ్రీ రాజు గారు )
విజయనగరం నుండి శ్రీ జగన్నాథం గారు శ్రీ రాజు గారు విచ్చేసి తమ ప్రసంగాలతో ఎంతో ఆనందం కలిగించారు.

(పరిచయాలు అక్కరలేని మనిషిని శ్రీ రాంబాబు గారిని పరిచయం చేస్తున్న శ్రీ మూడడ్ల ఉమామహేశ్వర రావు గారు.)
విజయవాడ నుండి శ్రీ రాంబాబు గారు ప్రత్యేక అతిథిగా విచ్చేసి అందరినీ అలరించారు. అప్సలా రాష్ట్ర వ్యాప్తంగా బలపడేందుకు రాష్ట్రమంతా పర్యటించడంలో తమకు కలిగిన అనుభవాలను వారు వివరించారు.

(గురువర్యులను పూలదండతో సత్కరించిన శ్రీ పిళ్ళా రమణమూర్తి గారు.
శాలువా కప్పి సత్కరించిన శ్రీ  రాంబాబు గారు.)
శ్రీ శర్మ గారిని అప్సలా సభ్యులు సత్కరించుకుని తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు.

(గురువర్యుల మాటలను శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్న సంఘ సోదరీమణులు. )
(గురువర్యుల ప్రసంగాన్ని ఆసక్తిగా వింటున్న సోదర సభ్యులు)

హాజరైన సభ్యులందరూ తమ ఆహ్వానాన్ని ప్రేమతో మన్నించి తమ కోసం ఎంతో అమూల్యమైన సమయాన్నివెచ్చించి విచ్చేసిన శ్రీ శర్మగారికి ధన్యవాదాలు తెలియజేశారు. 
(త్రినాథ్, ఖాదర్ వలీ, శేషుబాబు...)

ఎన్. ఆర్. ఐ. విద్యాసంస్థలలో సంస్కృత అధ్యాపకులైన శ్రీ త్రినాధ్ గారు అంతా తానుగా కనబడుతూ విందులో ఎవరికీ ఎటువంటి లోటూ లేకుండా పర్యవేక్షించారు.

(శ్రీ రాంబాబు గారికి చిన్నారి ఫాతిమా చేసిన జలప్రదానం)
శ్రీ ఖాదర్ వలీ గారి సుపుత్రి చిన్నారి ఫాతిమా విచ్చేసిన అతిథులకు చక్కగా సేవ చేసింది.
అందరి ఆశీస్సులనూ పొందింది.

విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు.
ఈ సమావేశం వివరాలను మరుసటి రోజు పత్రికలలో ప్రకటించిన పత్రికల యాజమాన్యం వారికి, ఆయా విలేఖరులకు అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు.

గమనిక:
పై చాయా చిత్రాలు ఇక్కడ చూసేందుకు చిన్నవిగానే కనబడతాయి.
కాని వాటిపై క్లిక్ చేసినట్టైతే వేరొక విండో లో పెద్దగా ఓపెన్ అవుతాయి.
ఆ తరువాత అవి కావాలనుకుంటే - మౌస్ తో వాటిపై రైట్ క్లిక్ చేసి "సేవ్" అన్న ఆప్షన్ ఎంచుకుని, మీ పెన్ డ్రైవ్ లో కాని, మీ హార్డ్ డిస్క్ లో కాని మీకు నచ్చిన చోట సేవ్ చేసుకోవచ్చు.

Wednesday, February 15, 2012

శ్రీ సాయి ప్రసాద్ గారికి విజ్ఞప్తి


శ్రీ సాయి ప్రసాద్ గారు -
ప్రస్తుతం ఎన్.ఆర్ .ఐ. అకాడమీ, విజయవాడ లో సంస్కృతవిభాగం అధ్యక్షులుగా పని చేస్తున్నారు. సహృదయులు. మాటకారి. ఇతరులకు సహాయం చేయడంలో అందరికంటే ఒక అంజ ముందుగానే ఉంటారు. వారికి మా అభినందనలు.

కానీ, శ్రీసాయిప్రసాద్ గారు,
మీరు ఇతరులకు సహాయం చేయాలనే సదుద్దేశంతో చేస్తున్నకొన్నిమంచి పనులు మరికొంతమందికి సమస్యగా మారుతున్నాయనే విషయాన్నిమీకు స్పష్టం చేయదలిచాము.

విజయవాడలో మిమ్మల్ని ఉద్యోగంకోసం ఎవరైనా ఆశ్రయిస్తే దయచేసి వారికి విజయవాడలోనే ఎక్కడో ఒకచోట పోస్టింగ్ ఇప్పించండి.
మాకేమీ
అభ్యంతరం లేదు. కానీ మీరు చాలామందిని విశాఖపట్నంకి పంపించారు.
ఆశ్రితజనపక్షపాతి అయిన మీరు విశాఖపట్నంలో ఒక విశ్యవిద్యాలయం ఉన్నదని, అందువల్ల ఇక్కడ సంస్కృతం చక్కగా చెప్పగల అధ్యాపకులు చాలా మంది ఉన్నారని మరచిపోయారేమో.
ఇక్కడ ఉన్నవారు చాలరని మీరు పై ఊళ్ళ నుండి ఇక్కడికి సంస్కృత అధ్యాపకుల్ని ఎగుమతి చేయడం మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది.
వారు వచ్చి చాలా తక్కువ జీతాలకు ఇక్కడ కళాశాలల్లో చేరుతూ ఉండడం వలన తక్కువ జీతాలకే దొరికే అధ్యాపకులు చాలామంది ఉన్నారని ఇక్కడి కళాశాలల యాజమాన్యాలకు తెలిసిపోయింది.
దాంతో, ఇక్కడ చాలాకాలం నుండి ఉన్న అధ్యాపకులకు సరిగా ఇంక్రిమెంట్లు పడటంలేదు.

సప్ప్లైని బట్టి డిమాండ్ ఉంటుందనే సూత్రం మీకు తెలియనిది కాదు.
కానీ ఇక్కడ ఎంతమందిని కావాలంటే అంతమందిని మీరు సప్ప్లై చేస్తూ ఉండడం మాకు తలనొప్పిగా మారింది.
మీరు ముప్ఫైవేల జీతానికి గాని, లేదా నలభైవేల జీతానికి గాని ఎవరినైనా తగిన వ్యక్తిని పంపించండి.
మేము కూడా సంతోషిస్తాం.
కానీ మీరు పదిహేను వేలకో పద్దెనిమిది వేలకో చవకగా ఇక్కడకు అధ్యాపకులను పంపించకండి.
ఆ మాత్రం చెప్పగలవారు ఆమాత్రం జీతాన్ని కళ్ళకద్దుకొని సంతోషంగా పనిచేసేవారు విశాఖపట్నంలో చాలామంది ఉన్నారని మీకు స్పష్టం చేస్తున్నాము.
విధంగా పైఊళ్ళ నుండివచ్చిఇక్కడ చేరుతున్నవారు తమ కడుపు కొడుతున్నారని విశాఖపట్నం లోకల్ అధ్యాపకులు భావిస్తున్నారు.

ఇటువంటి అభిప్రాయాలు బలపడితే భవిష్యత్తులో చాలా కష్టం.
ఈ విధమైన పొరపాట్లు మన సంఘానికే చాలా చేటు తెస్తాయని మీకు తెలియని విషయం కాదు.

అందువలన
దయచేసి ఉద్యోగం కావాలని మిమ్మల్నిఎవరైనా ఆశ్రయిస్తే వారికి విజయవాడలోనే పోస్టింగ్ ఇప్పించండి.

మాకు వచ్చిన సమాచారం ప్రకారం అప్పటికే అక్కడ ఉద్యోగం చేస్తున్న వారినే మీరు ఇక్కడికి పంపిస్తున్నారు.
ఇక్కడ కూడా ఎవరికీ తీసిపోకుండా పాఠాలు చెప్పగలవారు ఉన్నారని మీకు విజ్ఞప్తి చేస్తున్నాము.

ఎన్.ఆర్. ఐ. విశాఖ విభాగంలో సంస్కృత అధ్యాపకులకు ఏమైనా అవకాశం ఉంటే మాకు చెప్పండి.
మేము ఇక్కడి వారిని అక్కడకు పంపిస్తాము.
అందువలన మీరు ఇటు అధ్యాపక సంఘానికి, అటు మీ యాజమాన్యానికి కూడా ఉపకారం చేసినట్లు అవుతుంది.
కేవలం యాజమాన్యం దృష్టిలో మీ పలుకుబడిని పెంచుకోవాలనే ఉద్దేశంతో వారు కోరుకున్నట్లు చవకగా దొరికే అధ్యాపకుడిని వారి చెంతకు ఎగుమతి చేయవద్దని మిమ్మల్ని గట్టిగా కోరుతున్నాము.

ఎవరో ఒక అధ్యాపకుడు దీనస్థితిలో ఉండి అతనికి ఉద్యోగం అత్యవసరం అనుకున్న పక్షంలో అటువంటివారికి ఇక్కడ అవకాశం ఉన్నపుడు తప్పకుండా పంపించండి.
అటువంటివారికి
మానవతా దృక్పథంతో మేము స్వాగతం పలుకుతాం.
కానీ
, అప్పుడు కూడా, విశాఖపట్నం సంస్కృత అధ్యాపక సంఘాన్ని ముందుగా సంప్రదించి చేయవలసిందిగా మేము మిమ్మల్ని కోరుతున్నాము.

మీరు కూడా విషయాన్ని సహృదయంతో అర్థంచేసుకొని సహకరించగలరని ఆశిస్తున్నాము.

ఇట్లు -
ఆంధ్రప్రదేశసంస్కృతఅధ్యాపకసంఘం
విశాఖపట్నం విభాగం.

Saturday, February 4, 2012

విశాఖ సంస్కృత అధ్యాపక సంఘం ఆవిర్భావం నాటి చాయా చిత్రాలు








నవంబర్ ౧౪, ౨౦౧౦


౨౦౧0 నవంబర్ ౧౪ తేదీ శ్రీ పిళ్ళా రమణ మూర్తి గారి ఆహ్వానం మేరకు విశాఖ లోని సంస్కృత అధ్యాపకులందరూ ద్వారకానగర్ లోని భారతీయ విద్యా కేంద్ర కళాశాలలో సమావేశమయ్యారు. రోజు ఆంధ్రప్రదేశ సంస్కృత అధ్యాపక సంఘం, విశాఖ విభాగం ఏర్పడిందని అందరి హర్షధ్వానాల నడుమ ప్రకటించడం జరిగింది.

శ్రీ పిళ్లా రమణ మూర్తి గారు గౌరవ అధ్యక్షులుగా..
శ్రీ పూర్ణచంద్ర రావు గారు గౌరవ ఉపాధ్యక్షులుగా...
శ్రీ శ్రీరాములు నాయుడు గారు గౌరవ సలహాదారుగా...

శ్రీ పెన్మెత్స పెద్ది రాజు గారు అధ్యక్షులుగా...
శ్రీ మూడడ్ల ఉమామహేశ్వర రావు గారు ఉపాధ్యక్షులుగా...
శ్రీ జే. ఎస్. ఆర్. ఎన్. వర్మ గారు కోశాధికారిగా...
శ్రీ గౌరీ నాయుడు గారు సహాయ కోశాధికారిగా...
శ్రీ జి. మన్మథ రావు గారు కార్యదర్శిగా...
శ్రీ ఎం. కామేశ్వర రావు గారు సహాయకార్యదర్శిగా...
శ్రీమతి హరిప్రియ గారు మహిళాకార్యదర్శిగా...
శ్రీ యస్. వి. యస్.యన్. యన్. మూర్తి గారు కో-ఆర్డినేటర్ గా...
శ్రీమతి జ్యోతిర్మయి గారు మహిళా కో-ఆర్డినేటర్ గా...
శ్రీ శ్రీనివాస కృష్ణ గారు కార్య నిర్వాహకులు గా...
శ్రీ జి. సత్యం గారు, శ్రీ ఎ.వి.యస్.ప్రకాష్ గారు, శ్రీ ఇరుకు విద్యాసాగర్ గారు సలహాదార్లుగా ఉండేందుకు అంగీకరించారు.

విజయవాడ అధ్యాపక సంఘం వారు తమ శుభాకాంక్షలను తెలియజేశారు.
విశాఖ సంస్కృత అధ్యాపక సంఘం వారు వివిధ కార్యక్రమాలకు సమావేశం అయ్యేందుకు గాను ఐదవ జాతీయ రహదారి పై ఉన్న భారతీయ విద్యాభవన్ ను ఉపయోగించుకొనవచ్చునని శ్రీ పిళ్లా రమణ మూర్తి గారు వరం ప్రసాదించేశారు.

...



प्रिय सोदराः!
౩౧ - ౧౦ - ౨౦౧౦ నాడు హెరిటేజ్ హోటల్ లో సమావేశం కావలసిందిగా విశాఖ లో ఇంటర్మీడియట్ పిల్లలకు వివిధ కళాశాలల్లో సంస్కృతం బోధిస్తున్న అధ్యాపకులందరికీ ఆహ్వానం పంపడం జరిగింది. మొత్తం ముప్ఫై ఐదు మంది వరకు ఈ ఆహ్వానానికి ప్రతిస్పందించారు. విజయవాడ నుండి రాంబాబు గారు, నరసింహాచార్యులు గారు విచ్చేశారు. అసలు ఈ విధంగా విశాఖ లో సమావేశం జరగడానికి మూలకారణమే శ్రీ రాంబాబు గారు. విశాఖలో ఉన్న తమ మిత్రులు శ్రీ వర్మ గారి ద్వారా మరియు శ్రీనివాస కృష్ణ ద్వారా ఈ సమావేశం జరిగేలా చూశారు. ఆ నాడు హెరిటేజ్ హోటల్ లో ఐన మొత్తం ఖర్చులను శ్రీ వర్మ గారే భరించారు.
సమావేశం లో మొదటగా విజయవాడ అప్స్లా వారు ప్రచురించిన సంవిద పత్రికను నారాయణ కళాశాలలో పని చేస్తున్న అధ్యాపకులు శ్రీ పెద్దిరాజు గారు మరియు వర్మ గారు తమ చేతులమీదుగా విడుదల చేశారు.

అనంతరం శ్రీ చైతన్య కళాశాలలో పని చేస్తున్న శ్రీ మూడడ్ల ఉమామహేశ్వర రావు గారు మాట్లాడుతూ ఒకప్పుడు సంస్కృతం చదివినందుకు గర్వించే రోజులు ఉండేవని కాని ఈనాడు అయ్యో మేము సంస్కృతం చదువుకొని పొరబాటు చేశామేమో, అందువల్ల ఈ రోజు పొట్ట గడవడం కూడా కష్టంగా ఉంది అని బాధ పడేలా పరిస్థితులు మారిపోయాయని అన్నారు.

అనంతరం ఎన్ ఆర్ ఐ కళాశాలలో పని చేస్తున్న శ్రీ ఎం కామేశ్వర రావు గారు మాటాడుతూ, ఇంటర్ మీడియట్ సిలబస్ చాలా సులువుగా ఉంటోందని, దానివలన విద్యార్థులకు సంస్కృతభాష పై సరైన అవగాహన కలగటం లేదని చెప్పి ఈ విధమైన సిలబస్ ను అటు విద్యార్థులకు, ఇటు బోధకవర్గానికి, మరో వైపు సమాజానికి కూడా అనుకూలంగా ఉండేలా మార్చాలని అన్నారు.

పిమ్మట శ్రీ చైతన్య కళాశాల లో పని చేస్తున్న శ్రీనివాసకృష్ణ మాటలాడుతూ సంస్కృతం వలన ఎక్కువ మార్కులు తెచ్చుకొనడం ఒకటే ప్రయోజనం అనే భావం అందరిలోనూ నెలకొన్నదని, ఆ పరిస్థితులు పోయి సంస్కృతం పై ఆదరం పెరగాలంటే సంస్కృతం చదువుకున్న వ్యక్తులు ఎంతో సంస్కారవంతులు అవుతారన్న అభిప్రాయం బలపడేలా మనం కృషి చేయాలని అన్నారు.

అనంతరం శ్రీ రాంబాబు గారు మాటాడుతూ మన అందరి అభిప్రాయాలు ఒకటే అని, కాని ఇవన్నీ మనం అమలు చేయాలంటే ఒంటరిగా చేయలేమని, మనం ఒక సంఘంగా ఏర్పడాలని, సంఘే శక్తిః కలౌ యుగే అని మన అమరభాష మనకు ప్రబోధిస్తూ ఉన్నదని, విజయవాడ నగరంలో సంస్కృత అధ్యాపక సంఘం గత ఐదారు సంవత్సరాలుగా చురుకుగా పని చేస్తున్నదని, దానివలన అక్కడి అధ్యాపకులందరిలోనూ మంచి చురుకుదనం, ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్నాయని, అలాగే, విశాఖలో కూడా మీరు ఒక సంఘంగా ఏర్పాటు కావాలని మా ఆకాంక్ష అని, ఇదే విధంగా రాష్ట్రం అంతటా ప్రతి జిల్లాలోనూ సంస్కృత అధ్యాపక సంఘాలు ఏర్పడాలనే ఆశయంతో రాష్ట్రం అంతా పర్యటిస్తూ ఈనాటికి విశాఖ నగరానికి చేరుకున్నామని వివరించారు.


అనంతరం శ్రీ నరసింహాచార్యులు గారు విజయవాడ నగరంలో సంస్కృత అధ్యాపక సంఘం నిర్వర్తిస్తున్న వివిధ కార్యకలాపాలను గూర్చి వివరించారు. ప్రతి శుక్రవారం క్రమం తప్పక సంఘ సమావేశాలు జరుగుతున్నాయని, ఆ సమయంలో వివిధ కావ్యాల చదవడం చెప్పడం జరుగుతోందని, ఆయా సందర్భాలలో పండితులను ఆహ్వానించి వారి సందేశాలను గ్రహించడం జరుగుతోందని, ఇంకా అధ్యాపకులకు వివిధ సందర్భాలలో ఎక్కడైనా తమ విధి నిర్వహణలో ఆటంకాలు ఏర్పడితే అవి అందరం కలసి పరిష్కరించుకుంటున్నాం అని చెప్పారు. మీరు సంఘం గా ఏర్పడిన తరువాత మీరు మేము అనే భేదం లేకుండా మనమంతా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే అనే భావంతో మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం అని చెప్పారు.
తరువాత ఇతర అధ్యాపకులు కూడా కొందరు సంక్షిప్తంగా ప్రసంగించారు. కొందరు తమ సందేహాలను అడిగి సమాధానాలను పొందారు.

తరువాత అల్పాహార విందుతో సమావేశం ముగిసింది. కాని, శ్రీ రాంబాబు, శ్రీ నరసింహాచార్యులు గార్లు చెప్పిన మాటలు విశాఖ అధ్యాపకుల మెదడులనుండి అంత తొందరగా చెరిగిపోయేలా లేవు. వారిని మెచ్చుకుంటూ, చక్కటి వేదికతో పాటు రుచికరమైన విందును ఏర్పాటు చేసిన శ్రీ వర్మ గారికి ధన్యవాదాలు సమర్పిస్తూ, అధ్యాపకులందరూ మరలా ఎప్పుడు సమావేశం అవుదామని చర్చించుకుంటూ తమ తమ ఇళ్ళకు బయలుదేరారు.