Sunday, August 5, 2012

ఆంద్రప్రదేశ సంస్కృత అధ్యాపక సంఘం వారి విహార యాత్ర

యారాడ గ్రామం మరియు సముద్రం మరియు సముద్ర తీరం ఒక విహంగ వీక్షణ 
ఫోటోలను క్లిక్ చేస్తే అవి మరింత పెద్దగా కనిపిస్తాయి.
బంగారు ఇసుక


 అగ్రి గోల్డ్ వారి రిసార్ట్స్

ప్రయోగ శాలకు చెందినా భూమిలో పుష్కలంగా పోషింపబడుతూ ఏపుగా ఎదుగుతున్న వరి.

దేవుని కొలువు


దేవాలయానికి చెందిన గణపతి విగ్రహం

దేవస్థానం వారి ధేనువు.  కాళిదాస మహాకవి వర్ణించిన నందినీ ధేనువు యొక్క వర్ణం గుర్తు వస్తోంది కదా???

నిర్మాణం లో ఉన్న దేవాలయానికి చెందిన విగ్రహాలు.  ఈ కొంగల విగ్రహాల ఎత్తు ఎంతో ఊహించగలరా?

శిలతో చేసిన స్నానద్రోణి.  నీటితో నింపడమే తరువాయి. 

ఇచ్చట విహారం చేసేందుకు కేవలం అదృష్టవంతులే నోచుకుంటారు. 


సంస్కృత అధ్యాపకుల సమావేశం

మనోహరమైన వివిధ వర్ణాలలో రెల్లు పూలు

కఠిన శిలలను సమాకృతిలో ఖండిస్తున్న ఆధునిక యంత్రం

పంట కాలువ

పెంపుడు ఆంబోతు


సంస్కృత అధ్యాపకుల సమావేశం

కొందరు సంస్కృత అధ్యాపకులు

మరలా రండి అని తలలను ఊపుతూ వీడ్కోలు పలుకుతున్న రెల్లు పూలు





Monday, July 30, 2012

విశాఖ సంస్కృత సభకు స్వాగతం !!!

ప్రియ సంస్కృత సోదరీ సోదరులందరికీ సాదరం హార్దికం ఆహ్వానం!!!
 
ప్రియ సహోదరులారా, 
ఆగస్ట్ నెల 19 వ తేదీ నాడు ఆంధ్రప్రదేశ సంస్కృత అధ్యాపక సంఘం విశాఖపట్టణంలో రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహిస్తున్నది.  

ఆగస్ట్ 19 వ తేదీ ఆదివారం కావడం, ఆ మరుసటి రోజు అనగా ఆగస్ట్ 20 వ తేదీ రంజాన్ పండుగ సందర్భంగా సెలవు కావడం వలన రాష్ట్రంలోని నలుమూలలనుండి మన సంస్కృత సహోదరులందరూ సభకు విచ్చేసి మరల విశ్రాంతిగా తమ తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు తగినంత సమయం ఉంటుందనే ఉద్దేశంతో ఆరోజును సమావేశానికి తగిన 
రోజుగా భావించి ఆ నాడు సభను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకొనడం జరిగింది. 

అందువలన ఈ సభకు మీరందరూ తప్పక విచ్చేసి మన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసినదిగా కోరుతున్నాము.  సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు తమ పేరు, ఊరు, పని చేస్తున్న కళాశాల, మొబైల్ నంబరు, ఈ మెయిల్ ఐడి తెలియజేసి తప్పక రిజిస్ట్రేషన్ చేసుకొన వలసినదిగా  కోరుచున్నాము.

ఉదయం  08.30 గంటలకు సభ ప్రారంభమౌతుంది. (08.30 నుండి 10.20 వరకు) మొదటి సమావేశంలో మన సంఘం సాధించిన విజయాలు, ప్రగతిని మన నాయకులు నివేదిస్తారు.  పిమ్మట మనం వివిధ స్థాయిలలో ఎదుర్కొంటున్న వివిధ సమస్యల గూర్చి చర్చలు ఉంటాయి.  పిమ్మట భవిష్యత్తులో మన కార్య ప్రణాళికలు ఎలా ఉండాలో నిర్ణయించుకుంటాము.
ఇలా భూత వర్తమాన భవిష్యత్తులలో మన స్థితిని గూర్చిన సమీక్ష  మొదటి సమావేశంలో జరుగుతుంది. 

(10.30 నుండి 11.30 వరకు) రెండవ సమావేశంలో రాబోయే మన క్రొత్త పాఠ్య పుస్తకం ఏ విధంగా ఉంటే బాగుంటుందో సూచనలను, సలహాలను ఇవ్వడం, స్వీకరించడం, వివరించడం జరుగుతుంది.  అలాగే మన ప్రశ్నపత్రం ఏ విధంగా ఉంటే విద్యార్థి మరింత ఆసక్తిగా సంస్కృతం చదివేందుకు ఇష్టపడతాడో చర్చిస్తాము.  
మన చర్చల సారాంశాన్ని మన నాయకులు తరువాత పాఠ్యపుస్తక నిర్మాణ కమిటీకి నివేదించి సాధ్యమైనంత వరకు మన ఆకాంక్షల మేరకు క్రొత్త పాఠ్య పుస్తకం విడుదల అయ్యేందుకు కృషి చేస్తారు.   

(11.40 నుండి 01.00 వరకు) మూడవ సమావేశంలో విశాఖపట్నంలోని ప్రముఖ విద్యాసంస్థల అధినేతలు ముఖ్య అతిథులుగా విచ్చేస్తారు.  వారిని సభకు పరిచయం చేసిన పిమ్మట వారికి మనం విద్యాపరంగా సామాజికంగా మరియు ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమస్యలను నివేదిస్తాము.  వారిని ప్రతిస్పందించ వలసిందిగా కోరుతాము. 

పిమ్మట 01.00 నుండి 02.00 వరకు మధ్యాహ్న భోజన విరామం ఉంటుంది.

(02.00 నుండి 03.00 వరకు) నాల్గవ సమావేశంలో మన సంఘానికి సంబంధించిన రాష్ట్ర స్థాయి కార్యవర్గం ప్రకటించబడుతుంది.  ఈ కార్యవర్గం ఒక సంవత్సరానికి లేదా మరుసటి సమావేశం వరకు మాత్రమే పరిమితమై ఉంటుంది.
(03.00 నుండి 04.00 వరకు) ఐదవ సమావేశంలో సమారోపోత్సవం జరుగుతుంది.  దీనికి ఆంద్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి శ్రీ జార్జ్ విక్టర్ గారు విచ్చేసి ప్రసంగించడమే కాకుండా మన సంఘంలోని పెద్దలను ఉచిత రీతిన సత్కరిస్తారు.  

ఇది మనం జరపబోయే సమావేశం యొక్క సంక్షిప్త స్వరూపం.

మన కార్యక్రమం జరగబోయే వేదిక
శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళ్యాణ మండపం, ఎం. వి. పి. కాలనీ, రైతు బజారు ఎదురుగా, విశాఖపట్నం.
విశాఖపట్నం బస్సు స్టాండ్ నుండి 4 కిలోమీటర్ల దూరం.  ఆటో ఛార్జ్ 30 లేదా 35  ఇవ్వవచ్చు.
విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి 6 కిలోమీటర్ల దూరం. ఆటో ఛార్జ్ 50 లేదా 60 ఇవ్వవచ్చు.
ఈ రెండు స్థలాలనుండి వేదిక చెంతకు బస్సు నంబరు 900 ఎక్కి రావచ్చు.  
శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాల నుండి వచ్చే సంస్కృత సోదరులు బస్సు స్టాండ్ వరకు వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇసకతోట జంక్షన్ లో దిగితే అక్కడి నుండి ఒక కిలోమీటర్ దూరంలోనే మన వేదిక ఉంటుంది. 

సోదరీ సోదరులందరూ మా ఆహ్వానాన్ని అంగీకరించి తప్పక రాగలరని మరల మరల విజ్ఞప్తి చేస్తూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము.  

ఇట్లు

పెన్మెత్స పెద్దిరాజు, అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ సంస్కృత అధ్యాపక సంఘం, విశాఖపట్నం
మరియు
గండి మన్మథ రావు, కార్యదర్శి,  ఆంధ్రప్రదేశ్ సంస్కృత అధ్యాపక సంఘం, విశాఖపట్నం
E Mail - apsla.visakha@gmail.com
 

Wednesday, April 25, 2012

డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో ఎమ్మే సంస్కృతం

మన సోదరులు చాలామంది సంస్కృతంలో అర్హత సాధించడానికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఏయే విశ్వవిద్యాలయాలలో ఉన్నదో తెలియక తికమక పడుతూ అందరినీ సలహాలు అడుగుతుంటారు.   అలాంటి వారి కోసం ఇక్కడ ఆయా విశ్వవిద్యాలయాల చిరునామాలు, ఫోన్ నంబర్లు ఇస్తున్నాం.  సలహాలు కోరేవారికి, సలహాలు ఇచ్చేవారికి కూడా ఇది తప్పక ఉపయోగపడుతుందని మా నమ్మకం.


01) కాకతీయ విశ్వవిద్యాలయము, వరంగల్, ఆంధ్రప్రదేశ్.
Address : Kakatiya University, Warangal,
Andhra Pradesh - 506009
Phone - +91-870-2438877, 2438899 

Official Website / Institution home page: sdlceku.ac.in
To find details for Application Procedure, Admission Notification and Results refer to website - http://www.kuwarangal.com


02) బెంగళూరు విశ్వవిద్యాలయము, కర్ణాటక

Address : Jnana Bharathi Bangalore - 560 056 Karnataka 
Phone - 080 - 22961006, 080 - 22961005
Email : vcbu@vsnl.com

To find details for Application Procedure, Admission Notification and Results refer to website - http://www.bub.ernet.in


03) కువెంపు విశ్వవిద్యాలయము, కర్ణాటక
Address : Kuvempu University, Jnana Sahyadri,
Shankaraghatta - 577 451 Shimoga, Karnataka
Phone - 08282-256246, 256450
Fax : 08282-256370

To find details for Application Procedure, Admission Notification and Results refer to website - http://www.kuvempuuniversitydde.org


04) యమ్.డి.యు. రోహతక్ విశ్వవిద్యాలయము, హర్యానా 
Address : M.D.U. Rohtak University, Rohtak - 124 001, Haryana
Phone - 01262-274327, 01262-292431, 01262-274640
Email : vc@mdurohtak.net

To find details for Application Procedure, Admission Notification and Results refer to website - http://www.mdudde.net/



05) ముంబై విశ్వవిద్యాలయము, మహారాష్ట్ర
Address : Mumbai University, Mumbai, Maharashtra
Phone - 91-22-2652 7086 / 2652 3048
Fax - 91-22-26527083
Email : ide@mu.ac.in

To find details for Application Procedure, Admission Notification and Results refer to website - http://www.mu.ac.in/





06) ఉస్మానియా విశ్వవిద్యాలయము, ఆంధ్రప్రదేశ్
Address : Osmania University, Hyderabad-500007
Andhra Pradesh
Email vc@osmania.ac.in/ registrar@osmania.ac.in 

To find details for Application Procedure, Admission Notification and Results refer to website - http://www.osmania.ac.in/



07) భోజ ఓపెన్ విశ్వవిద్యాలయము, మధ్యప్రదేశ్.
Address : Bhoj Open University, Madhya Pradesh Bhoj (Open) University,
Kolar Road, Bhopal-462016
Phone - 0755-2492090, 2492091
Fax - 0755-2424640

To find details for Application Procedure, Admission Notification and Results refer to website - http://www.bhojvirtualuniversity.com/



08) కర్ణాటక విశ్వవిద్యాలయము, మైసూరు, కర్ణాటక
AAddress : Manasagangotri, Karnataka University, Mysore,
Karnataka - 570006
Phone - 91-821-2515149 / 2512471
Fax : 91-821-2500846, 2500847
Email : registrar@ksoumysore.com


To find details for Application Procedure, Admission Notification and Results refer to website - http://ksoumysore.edu.in/


09) కోట ఓపెన్ విశ్వవిద్యాలయము, రాజస్థాన్
Address : Kota Open University, Rawatbhata Road, Kota-324010
Phone - 91-744-2472507
Fax : 91-744-2472517
Email : rckota@vmou.ac.in

To find details for Application Procedure, Admission Notification and Results refer to website - http://www.vmou.ac.in/



10) రాజర్షి టాండన్ విశ్వవిద్యాలయము, ఉత్తరప్రదేశ్
Address : Rajarshi Tandon University, Shantipuram(Sector-F),
Phaphamau, Allahabad - 211013
Phone - 0532-2447035,2447038,2447028
Fax - 0532 - 2447032, 2447036
Email - uprtou@yahoo.co.in

To find details for Application Procedure, Admission Notification and Results refer to website - http://www.uprtouallahabad.org.in/





మాకు తెలిసిన వివరాలు ఇక్కడ పొందు పరచాము.  ఇవి కాకుండా మరెక్కడైనా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పద్ధతిలో సంస్కృతం చదివేందుకు అవకాశం ఉంటే, ఆ వివరాలు మాకు తెలియజేస్తే, మేము తప్పక ఇక్కడ ప్రచురిస్తాము.



Thursday, April 19, 2012

సాష్టాంగ నమస్కారము చేయడం ఎలా?




సాష్టాంగ నమస్కారము అంటే ఎనిమిది అంగాలతో చేయదగిన నమస్కారము అని పేరును బట్టి స్పష్టంగా అర్థం అవుతూనే ఉన్నది.  అయితే ఏమిటి ఆ ఎనిమిది అంగాలు ?

ఈ శ్లోకం హృదయస్థం చేస్తే ఆ అంగాలన్నీస్పష్టంగా గుర్తు ఉంటాయి. - 

> > ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా 
పద్భ్యాం కరాభ్యాం జానుభ్యాం ప్రణామో^ ష్టాంగ ఈరితః <<

 ౧) ఉరస్సుతో నమస్కారం - అనగా నమస్కారము చేసేటపుడు ఛాతీ నేలకు తగలాలి.

౨) శిరస్సుతో నమస్కారం - అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు 
తాకాలి.

౩) దృష్టితో - అనగా నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ మూర్తికి నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి.

౪) మనస్సుతో నమస్కారం - అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మనసా నమ్మి చేయాలి. 

౫) వచసా నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం - నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్టదైవాన్ని మాటతో స్మరించాలి.  
అంటే - ఓం నమశ్శివాయ అనో లేక ఓం నమో నారాయణాయ అనో 
ఓం నమో మేరీతనయాయ అనో లేక ఓం నమో మహమ్మదాయ అనో 
మాట పలుకుతూ నమస్కరించాలి. 

౬) పద్భ్యాం నమస్కారం  - అంటే - నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి. 

౭) కరాభ్యాం నమస్కారం అంటే - నమస్కారం చేసేటపుడు  రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి.

౮) జానుభ్యాం నమస్కారం అంటే - నమస్కారం చేసేటపుడు రెండు మోకాళ్ళు కూడా నేలకు తగులుతూ ఉండాలి.



సాష్టాంగ నమస్కారము

సూర్యనమస్కారాలు చేసేవారికి సాష్టాంగ నమస్కారము చిరపరిచితమైనదే.
పైన చూపబడిన భంగిమ సూర్యనమస్కారాల శ్రేణిలో ఆరవదైన సాష్టాంగనమస్కారాసనము.    

Tuesday, April 17, 2012

సప్త ధాతువులు


యుక్తే వయసి యః శాన్తః స శాన్తః ఇతి మే మతిః.
దాతుషు క్షీయమాణేషు శమః కస్య న జాయతే?


భావము - యుక్త వయసులో ఎవరైతే ఇంద్రియ నిగ్రహం కలిగి ప్రశాంతంగా ఉంటారో  వారే సహజంగా ఇంద్రియాలపై విజయం సాధించిన వారు అని నా (అనగా కవి యొక్క) అభిప్రాయము.  ధాతువులు క్షీణించిపోతున్న వయసులో ఎవని ఇంద్రియాలు అదుపులో ఉండవు?


సరే, మరి ఇక్కడ ధాతువులు క్షీణించి పోతాయి అన్నారు కదా!  ఏమిటా ధాతువులు అని ప్రశ్న.
ఆయుర్వేదశాస్త్రం మానవశరీరం సప్తధాతుమయం అని చెబుతుంది. 
ఆ సప్త ధాతువులు ఇవి - 
౧)  రసము ౨) రక్తము ౩) మాంసము ౪) మజ్జ ౫) అస్థి ౬) మేధ ౭) శుక్రము
సప్త ధాతువులు 
౧ )  రసము  - మనిషి తీసుకొనే ఆహార పదార్థం రసంగా మారిపోయి శరీరంలోని అన్ని భాగాలను పోషిస్తుంది. 
౨) రక్తము - ఇది రక్తనాళాల గుండా ప్రవహిస్తూ దేహంలోని కణాలన్నిటికీ  కావలసిన ఆక్సిజన్ ను సరఫరా చేస్తుంది. కర్బనాలను గ్రహిస్తుంది. 
ఊపిరితిత్తులలో శుభ్రపరచబడి గుండె ద్వారా మరలా శరీరంలోని వివిధ భాగాలకు ప్రవహిస్తుంది.
౩) మాంసము - హృదయ కండరాలు, వర్తుల కండరాలు, అస్థి కండరాలు - ఇటువంటి వివిధమైన పేర్లతో మాంసం శరీరంలో నిండి ఉంటుంది.
౪) మజ్జ - ఇది ఎముకల కుహరాలలో ఉంటుంది.  మజ్జ నుండే రక్తం ఉద్భవిస్తుంది.
౫) అస్థి - అనగా ఎముక.  ఒక సిమెంటు భవనానికి లోపల ఇనుప రాడ్లు ఏ విధంగా నిలకడను కలిగించి నిలబెడతాయో అదే విధంగా శరీరాన్ని నిలబెట్టేవి ఎముకలు.  
౬) మేధ - అనగా కొవ్వు. శరీరానికి అవసరమైన దానికంటే అధికమైన ఆహారం అందితే అది శరీరంలో కొవ్వుగా మారి నిలవ చేయబడుతుంది.
౭) శుక్రము  - ఇది పునరుత్పత్తికి ఉపయోగపడే ధాతువు.  పురుషులలో శుక్రం అని, స్త్రీలలో శోణితం అని పిలవబడుతుంది.


ఈ ఏడు కాకుండా ఓజస్సు అనే మరొక ధాతువు కూడా ఉందని కొందరు అంటారు.


కాబట్టి - ఇటువంటి ధాతువులన్నీపుష్కలంగా శక్తిమంతంగా ఉన్నపుడే మానవుడు వాటిని అదుపులో పెట్టి మోక్షమార్గాన్ని అన్వేషించి పట్టుకోవాలి.  క్షీణించి పోయిన తరువాత అది ఎలా సాధ్యం?

Saturday, April 14, 2012

కొన్ని పంచాంగశాస్త్ర విషయములు

శ్రీనందన నామ సంవత్సర ఉగాది నాడు పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది.  ఆ వివరాలు ఈ బ్లాగులోనే ఉన్నాయి.  మీరు వెతికి చూడవచ్చు.  
లేదా ఈ క్రింది లింకును క్లిక్ చేసి చూడవచ్చును:  (http://samvidaapsla.blogspot.in/2012/03/23-03-2012.html)
ఆ సమయంలో కొందరు మిత్రులు కొన్ని ప్రశ్నలను అడిగారు.  
ఆ ప్రశ్నలు, వాటి సమాధానాలు మన సంస్కృత సోదరులకు  మాత్రమే కాక ఆసక్తి ఉన్న ఇతరులకు కూడా ఉపయోగపడతాయని ఇక్కడ పొందుపరుస్తున్నాము. 


ప్రశ్న - అధికమాసాలు ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయో తెలిసింది కానీ, అధిక మాసాలు ఎప్పుడు వస్తాయో తెలుసుకొనడం ఎలా?


సంక్రాంతిముందుగా సంక్రాంతి అంటే ఏమిటో తెలుసుకొంటే దానిని బట్టి తరువాత చెప్పబోయే విషయాలు అర్థమౌతాయి.  సూర్యుడు వివిధరాసులలోనికి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు.  మేషరాశిలోనికి ప్రవేశిస్తే మేషసంక్రమణం లేదా మేషసంక్రాంతి అని,  మకరరాశి లోనికి ప్రవేశిస్తే మకరసంక్రమణం లేదా మకరసంక్రాంతి అని అంటారు.  ఇలా ఒక సంవత్సరంలో సూర్యుడు పన్నెండు రాసులలోనికి ప్రవేశించడం వలన ఒక సంవత్సరంలో పన్నెండు సంక్రాంతులు ఏర్పడతాయి.
      
అధికమాసం - సాధారణంగా ఒక సంక్రాంతి రెండు అమావాస్యల మధ్యలో వస్తుంది.  కాని, రెండు అమావాస్యల నడుమ ఎపుడైతే  సంక్రాంతి ఉండదో ఆ మాసాన్ని అధిక మాసంగా పేర్కొంటారు.  అందువలన ఆ చాంద్రమాన సంవత్సరంలో పదమూడు నెలలు ఉంటాయి.  సాధారణంగా ఇటువంటి పరిస్థితి దాదాపు రెండున్నర సంవత్సరాలకొక సారి జరుగుతుంది.  అందువల్లనే అధిక మాసాలు ప్రతి సంవత్సరం కనబడవు.
      
క్షయమాసం - అయితే, ఒకొక్కసారి రెండు అమావాస్యల మధ్యలో రెండు సంక్రాంతులు ఏర్పడతాయి.  అటువంటి సమయంలో లుప్తమాసం లేదా క్షయ మాసం ఏర్పడుతుంది.  అంటే, ఆ సంవత్సరంలో (చాంద్రమాన  సంవత్సరంలో) పదకొండు నెలలు మాత్రమే ఉంటాయన్న మాట.  ఇటువంటి పరిస్థితి ఏర్పడడం అరుదే కాని అసంభవం మాత్రం కాదు.


     చైత్రం నుండి ఆశ్వయుజం వరకు వచ్చే ఏడు మాసాలలో మాత్రమే సూర్యసంక్రాంతి వచ్చే అవకాశం ఉండదని, అలాగే రెండు సంక్రాంతులు రావడం కార్తిక, మార్గశిర, పుష్యమాసాలలో మాత్రమే జరుగుతుందని లెక్క కట్టారు.  చాంద్రమాన సౌరమానాల మధ్యలో ఈ సంతులతను ఏర్పాటు చేయగలిగిన మన జ్యోతిశ్శాస్త్ర వేత్తలు ఎంతటి మేధావులో మనకు దీని ద్వారా అర్థమౌతుంది.  ఈ విధమైన గణన,  సూక్ష్మపరిశీలన పాశ్చాత్య విద్యను అభ్యసిస్తున్న మన భారతీయ విద్యార్థులకు తెలియజేసే బాధ్యత మనదే.  


ప్రశ్న - ఒక సంవత్సరానికి "ఈ గ్రహం రాజు"  "ఈ గ్రహం మంత్రి" - ఈ విధంగా ఎలా నిర్ణయిస్తారు?


రాజు - ఉగాది పండుగ ఆదివారం నాడు ఏర్పడితే సూర్యుడు రాజు అవుతాడు.  ఇలా - ఉగాది ఏ వారంనాడు ఏర్పడుతుందో ఆ రోజుకు అధిపతి ఆ సంవత్సరానికి రాజు అవుతాడు.


మంత్రి - మేష సంక్రాంతి సోమవారం నాడు ఏర్పడితే చంద్రుడు మంత్రి అవుతాడు.  ఇలా - మేష సంక్రాంతి ఏవారం నాడు ఏర్పడుతుందో ఆ రోజుకు అధిపతి ఆ సంవత్సరానికి మంత్రి అవుతాడు.


సేనాధిపతి  - సింహ సంక్రాంతి మంగళవారం నాడు ఏర్పడితే కుజుడు సేనాధిపతి అవుతాడు.  ఇలా - సింహ సంక్రాంతి ఏవారం నాడు ఏర్పడుతుందో ఆ రోజుకు అధిపతి ఆ సంవత్సరానికి సేనాధిపతి అవుతాడు.



సస్యాధిపతి  - కర్కాటక సంక్రాంతి బుధవారం నాడు ఏర్పడితే బుధుడు సస్యాధిపతి అవుతాడు.  ఇలా - కర్కాటక సంక్రాంతి ఏవారం నాడు ఏర్పడుతుందో ఆ రోజుకు అధిపతి ఆ సంవత్సరానికి సస్యాధిపతి అవుతాడు.


ధాన్యాధిపతి  - ధనుః సంక్రాంతి గురువారం నాడు ఏర్పడితే గురుడు  ధాన్యాధిపతి అవుతాడు.  ఇలా - ధనుః సంక్రాంతి ఏవారం నాడు ఏర్పడుతుందో ఆ రోజుకు అధిపతి ఆ సంవత్సరానికి ధాన్యాధిపతి అవుతాడు.


అర్ఘాధిపతి  - మిథునసంక్రాంతి శుక్రవారం నాడు ఏర్పడితే శుక్రుడు  అర్ఘాధిపతి అవుతాడు.  ఇలా - మిథునసంక్రాంతి ఏవారం నాడు ఏర్పడుతుందో ఆ రోజుకు అధిపతి ఆ సంవత్సరానికి అర్ఘాధిపతి అవుతాడు.


రసాధిపతి  - తులాసంక్రాంతి శనివారం నాడు ఏర్పడితే శనైశ్చరుడు  రసాధిపతి  అవుతాడు.  ఇలా - తులాసంక్రాంతి ఏవారం నాడు ఏర్పడుతుందో ఆ రోజుకు అధిపతి ఆ సంవత్సరానికి రసాధిపతి అవుతాడు.

నీరసాధిపతి  - మకరసంక్రాంతి ఆదివారంనాడు ఏర్పడితే సూర్యుడు నీరసాధిపతి అవుతాడు.  ఇలా - మకరసంక్రాంతి ఏవారం నాడు ఏర్పడుతుందో ఆ రోజుకు అధిపతి ఆ సంవత్సరానికి నీరసాధిపతి అవుతాడు.

మేఘాధిపతి  - సూర్యుడు సోమవారంనాడు ఆర్ద్రా నక్షత్రం లోనికి ప్రవేశిస్తే చంద్రుడు మేఘాధిపతి అవుతాడు.  ఇలా - సూర్యుడు ఏవారం నాడు  ఆర్ద్రా నక్షత్రం  లోనికి ప్రవేశిస్తాడో ఆ రోజుకు అధిపతి ఆ సంవత్సరానికి మేఘాధిపతి అవుతాడు.

ఈ విధంగా ఆధిపత్యాన్ని పొందిన వారిని నవనాయకులు (తొమ్మిది మంది ప్రధాన నాయకులు) అంటారు.  
వీరే ఒక సంవత్సర ఫలితాన్ని ప్రధానంగా శాసిస్తారు.

Monday, April 2, 2012

రఘుకులోద్ధారకుడైన శ్రీరాముని బయోడేటా

శ్రీరాముని జన్మతిథి - చైత్ర శుద్ధ నవమి.
శ్రీరాముని జన్మనక్షత్రము - పునర్వసు (నాల్గవ పాదము)
శ్రీరాముని జన్మలగ్నము - కర్కాటకము

01) శ్రీరాముని తల్లిదండ్రులు  - దశరథ మహారాజు, మహారాణి కౌసల్య.
02) శ్రీరాముని సోదరులు - భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు
03) శ్రీరాముని వంశగురువు - Vasishtha మహాముని
04) శ్రీరాముని అస్త్రవిద్యాగురువు - విశ్వామిత్ర మహాముని
05) శ్రీరాముని పినతల్లులు - సుమిత్ర, కైకేయి
06) శ్రీరాముని మామ - జనక మహారాజు


శ్రీరాముడు విశ్వామిత్రుని నుండి స్వీకరించిన మంత్రములు -
బల, అతిబల

శ్రీరాముడు విశ్వామిత్రుని నుండి స్వీకరించిన దివ్యాస్త్రములు -
దండచక్రం, ధర్మచక్రం, కాలచక్రం, విష్ణుచక్రం,
ఐంద్రాస్త్రం, వజ్రాస్త్రం, బ్రహ్మాస్త్రం,  పైనాకాస్త్రం, నారాయణాస్త్రం, క్రౌన్చాస్త్రం,  వారుణాస్త్రం,
శైవశూలం, బ్రహ్మశిరం, ఐషీకం, హయశిరము,
ధర్మపాశం, కాలపాశం, వరుణపాశం, శుష్కాశని, ఆర్ద్రాశని,
వర్షణం, శోషణం, సంతాపనం, విలాపనం, మదనం, తామసం, సౌమానం, సంవర్తం, మౌసలం,
సత్యాస్త్రం, మాయాధరాస్త్రం,
కంకాళము, ముసలము, కాపాలము, కంకణము, (ఈ నాలుగు  ఆసురాస్త్రములు)
ఆగ్నేయాస్త్రం (శిఖరం), వాయవ్యాస్త్రం (ప్రథనం),  వైద్యాధరాస్త్రం (నందనం),  గాన్ధర్వాస్త్రం (మానవం)
సౌరాస్త్రం (నిద్రను కలిగించేది, నిద్రను పోగొట్టేది), సౌరాస్త్రం (ఇతరుల తేజస్సును హరించే తేజః ప్రభం),
సౌమ్యాస్త్రం (శిశిరం),  పైశాచాస్త్రం (మోహనం), త్వష్ట్రాస్త్రం (సుదామనం), మానవాస్త్రం (శీతేషువు),     
మోదకి, శిఖరి,  (ఈ రెండు గదలు)
రెండు శక్తి అస్త్రాలు,
ఒక దివ్య ఖడ్గం

శ్రీరాముడు విశ్వామిత్రుని నుండి పొందిన దివ్యాస్త్ర-ఉపసంహార విద్యలు -
సంత్యవంతము, సత్యకీర్తి, ధృష్ట్రము, రభసము, ప్రతిహారతరము, పరాక్ ముఖము,  అవాక్ ముఖము, లక్షాక్షము, విషమము, దృఢనాభము, సునాభకము,        
  
  

శ్రీరాముడు విశ్వామిత్రుని నుండి విన్న కథలు -
01) తాటకా వృత్తాంతము,
02) సిద్ధాశ్రమ వృత్తాంతము,
03) కుశనాభ మహారాజు యొక్క పుత్రికల వృత్తాంతము, విశ్వామిత్రుని యొక్క వంశ వృత్తాంతము,
05) గంగానదీ వృత్తాంతము,  కుమారసంభవ వృత్తాంతము,  సగరమహారాజు చేసిన అశ్వమేథ యాగ వృత్తాంతము, గంగావతరణ వృత్తాంతము,
06) క్షీరసాగరమథన వృత్తాంతము,
07) సప్తమరుత్తుల యొక్క జన్మ వృత్తాంతము,
08) అహల్యా వృత్తాంతము,  

(ఇంకా వ్రాయవలసినది ఉంది)

Thursday, March 29, 2012

సంస్కృత డాక్టరేట్ లకు శ్రీ వర్మ గారి సత్కారం

              విశాఖపట్నం స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో సంస్కృత సోదరులందరి ఎదుట డాక్టరేట్ సాధించిన సంస్కృత మిత్రులను సన్మానించాలని సంస్థ కోశాధికారి అయిన శ్రీ వర్మ గారు నిశ్చయించుకుని, సంస్థ అధ్యక్షులు అయిన శ్రీ పెద్దిరాజు గారికి ఈ విషయం తెలిపారు.  మార్చ్ నెల 29 వ తేదీన ఆంధ్రప్రదేశ సంస్కృత అధ్యాపక సంఘం ఆధ్వర్యవంలో, ఆర్.ఐ.ఓ. గారి అనుమతితో సభ జరిగింది.


           శ్రీ మూడడ్ల ఉమామహేశ్వర రావు గారి ప్రార్థనతో సభ మొదలైంది.

మొదట సంఘ అధ్యక్షులు శ్రీ పెన్మెత్స పెద్దిరాజు గారు మాటలాడుతూ హైస్కూల్ స్థాయిలో సంస్కృతాన్ని ఒక అధ్యయన విషయంగా ప్రవేశపెట్టవలసిందిగా సంఘం వారు ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని, అందుకు ప్రభుత్వ విద్యారంగం అధికారులు అనుకూలంగా స్పందించి, ఒక్క విశాఖపట్నం జిల్లా లోనే 300 టీచర్ పోస్ట్ లను ఇవ్వగలమని చెప్పారన్నారు.
సంఘ సభ్యులందరూ అందుకు తమ ఆనందాన్ని వ్యక్తం చేయగా పెద్ది రాజు గారు మాత్రం మరి ఈ 300  పోస్ట్ లు వస్తే, వాటినన్నింటిని మనం భర్తీ చేయగలిగిన సంఖ్యలో ఉన్నామా అని మనం ఆత్మ విమర్శ చేసుకొనవలసి ఉంది అని హెచ్చరించారు.  సంస్కృతం చదువుకున్న వారికి సరైన జీవిక లేదనే విచారాన్ని ప్రక్కకు తోసి సంస్కృతం చదివే వారిని ప్రోత్సహించాలని హితవు పలికారు.  
  
పిమ్మట సంఘ గౌరవాధ్యక్షులు శ్రీ పిళ్ళా రమణమూర్తి గారు మాటలాడుతూ, ఈ సంవత్సరం ఆగస్ట్ నెల 19 వ తేదీన విశాఖపట్నం సంస్కృత అధ్యాపక సంఘం వారు రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నామని సంఘసభ్యుల హర్షామోదాల కరతాళధ్వనుల నడుమ ప్రకటించారు.
ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గాను వివిధ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, సభ్యులందరూ తదేక దీక్షతో మహోత్సాహంతో వీటిలో భాగస్వామ్యం వహించాలని కోరారు.  కార్యక్రమనిర్వహణకు నిధులు అవసరమని, నగరంలోని కొందరు వదాన్యులైన దాతలు అందుకు అంగీకరించారని, అయినా, సంఘసభ్యులమైన మనం కూడా తలొక చేయి వేయవలసినదే అని, ఆయన కోరారు.

పిమ్మట సంఘ ఉపాధ్యక్షులైన శ్రీ మూడడ్ల ఉమా మహేశ్వర రావు గారు మాటాడుతూ గత సంవత్సరం నుండి ఇంత వరకు సంఘం చేపట్టిన కార్యక్రమాలను వివరించి, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా, సమయం మించి పోక మునుపే సంఘం దృష్టికి తీసుకురమ్మని,  సంఘ కార్యవర్గ సభ్యులందరూ ఆ సమస్యను పరిష్కరించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారని అందరి కరతాళ ధ్వనుల నడుమ దృఢమ్ గా ప్రకటించారు. 

పిమ్మట డాక్టరేట్ సాధించిన సంఘ సభ్యులకు సత్కారం జరిగింది.  సభలో ఆద్యంతం మౌనంగా చిరునవ్వుతో వేదికపై కూర్చున్న శ్రీ వర్మ గారి వదాన్యత ఈ సత్కారానికి మూల కారణం.  

ఈ సత్కారాన్ని అందుకున్న వారు వరుసగా...


01 ) శ్రీ పోలా ఉమా మహేశ్వర రావు గారు.  శ్రీ చైతన్య కళాశాలలో అధ్యాపకులు.  2005 వ సంవత్సరంలోనే ఆంధ్రవిశ్వవిద్యాలయంలో శ్రీ వేంకటేశ్వర రావు గారి మార్గదర్శకత్వంలో డాక్టరేట్ సాధించారు.  వారి అధ్యయన విషయం "శ్రీమద్భాగవతే పురుషార్థ దృష్ట్యా సుభాషిత విచారః."  


02) శ్రీమతి  చంద్రిక గారు.  2008 వ సంవత్సరంలో నాగార్జున విశ్వ విద్యాలయంలో శ్రీ సత్యనారాయణ రావు గారి మార్గదర్శకత్వంలో డాక్టరేట్ సాధించారు.  వారి అధ్యయన విషయం "భాసనాటకేషు అలంకార పరిపోషణం"  


03) శ్రీమతి  రాజ్యలక్ష్మి గారు.  2010 వ సంవత్సరంలో ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ ఎం.వి. రమణ గారి మార్గదర్శకత్వంలో డాక్టరేట్ సాధించారు.  వారి అధ్యయన విషయం "ఆంధ్రదేశీయానాం సంస్కృతవ్యాఖ్యాసాహిత్యం - ఏకం అధ్యయనం". 


04) శ్రీ పాటీలు శ్రీనివాస కృష్ణ గారుశ్రీ చైతన్య కళాశాలలో అధ్యాపకులు.  2011 వ సంవత్సరంలో (1- 11 - 11 తేదీ)  తిరుపతి నగరంలోని కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయం ఐన రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం లో డాక్టర్ రాణి సదాశివ మూర్తి గారి మార్గదర్శకత్వంలో డాక్టరేట్ సాధించారు.  వారి అధ్యయన విషయం "శ్రీమద్రామాయణే లోకవృత్తస్య అధ్యయనం".

సత్కార గ్రహీతలందరూ సంక్షిప్తంగా తమను తాము పరిచయం చేసుకొని తమ విజయానికి మూలకారకులైన వారిని స్మరించి, తమకు జరిగిన సత్కారానికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి  ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసి సత్కారాన్ని తమ చేతుల మీదుగా జరిపించిన అసిస్టంట్ కేంప్ ఆఫీసర్లు శ్రీ  మల్లికార్జున రావు గారికి మరియు శ్రీ భాస్కర రావు గారికి సంఘ సభ్యులు తమ కృతజ్ఞతలను తెలిపారు.


ఈనాడు వీరికి జరిగిన సత్కారం మరింత మంది సంస్కృత సోదర సోదరీమణులు విద్యారంగంలో ముందు ముందు ఇటువంటి ఘనతలు సాధించేందుకు ప్రేరణ కావాలని శ్రీ వర్మ గారు ఆకాంక్షించారు.
  
 శ్రీ మన్మథ రావు గారి వందన సమర్పణతో సభ ముగిసింది.

Wednesday, March 28, 2012

అక్షౌహిణి

మహాభారతంలో పాండవుల సైన్యం ఏడు అక్షౌహిణులు,   కౌరవుల సైన్యం పదకొండు అక్షౌహిణులు మొత్తం పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యం పాల్గొంది అని అంటారు కదా! 
రథయోధులు
 అసలు అక్షౌహిణి అంటే ఎంత సైన్యం?  అది చూద్దాం.
గజయోధులు

పై శ్లోకాన్ని నెమ్మదిగా లెక్కలలోనికి మారుద్దాం.
అశ్వయోధులు
దీన్ని బట్టి, ఒక అక్షౌహిణి సైన్యంలో -
21870  ఏనుగులు, 21870  రథాలు, 65610 గుఱ్ఱాలు, 109350  మంది కాల్బలము ఉంటాయన్నమాట!!!!

ఆధునిక భారతీయ కాల్బలము




 

Friday, March 23, 2012

సంస్కృత అధ్యాపక సంఘం వారి రూపక ప్రదర్శన - "ఖగోళ భువన విజయం"

ఆంధ్రప్రదేశ సంస్కృత అధ్యాపక సంఘం, విశాఖపట్నం శాఖ వారు  23 /03 /2012  నాడు శ్రీనందన నామ సంవత్సర యుగాది సందర్భంగా విశాఖ నగరంలోని మురళీనగర్ కాలనీ లోని వైశాఖి క్రీడోద్యానం లోని విశాల ప్రాంగణంలో పంచాంగశ్రవణ  కార్యక్రమాన్ని నిర్వహించారు.
అయితే, ఈ కార్యక్రమాన్ని"ఖగోళ భువన విజయం" అనే పేరిట ఒక రూపకంగా ప్రదర్శించడం జరిగింది.  ఈ ప్రయోగం క్రొత్తదని అద్భుతంగా ఉందని పలువురు ప్రేక్షకులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.  కాని, ఈవిధమైన కార్యక్రమానికి ఆద్యులు కీర్తి శేషులైన ఆచార్యశ్రీ దివాకర్ల రామ మూర్తి గారు.  వారి ఆధ్వర్యవంలో,  శ్రీ దూర్వాసుల భాస్కరమూర్తి గారి నిర్వహణా దక్షతలో విశాఖపట్నంలోని  శ్రీ కృష్ణాశ్రమంలో, అప్పుడప్పుడు ద్వారకా నగర్ లోని శంకరమఠంలోను, క్వాచిత్కంగా సింహాచల స్వామివారి సమక్షంలోను కూడా పండిత పరిషత్ప్రమోదదాయకంగా నలభై సంవత్సరాలు అవిచ్చిన్నంగా ఈ కార్యక్రమం జరిగిన విషయం నగరంలోని రసజ్ఞులెందరికో తెలిసిన విషయమే.  ఆ కార్యక్రమంలో శ్రీ తెన్నేటి విశ్వనాథం గారు, శ్రీ వసంతరావు వేంకటరావు గారు, శ్రీ పాటీలు తిమ్మారెడ్డి గారు, శ్రీ బంగారేశ్వరశర్మ గారు, శ్రీ కృష్ణమాచార్యులు గారు, కొండేపూడి వేంకట సుబ్బారావు గారు,  మొదలైన మహామహులు ఎందరో పాల్గొని దీని ప్రఖ్యాతికి మూల కారకులయ్యారు.
కాని, దాదాపు 2006  వ సంవత్సరం నుండి ఈ కార్యక్రమం అనివార్య కారణాలవలన నిలిచిపోయింది.  కేవలం నిలిచి పోయింది.  ఆగిపోలేదు.  ఆ తరువాత 2008 వ సంవత్సరంలో శ్రీచైతన్య కళాశాల సంస్కృత అధ్యాపకులు వారి కళాశాలలో ఈ కార్యక్రమం ప్రదర్శించి తమ సహాధ్యాపకుల  మెప్పు పొందారు.  ఆ ధైర్యంతో 2012  ఉగాది నాడు మరలా విశాఖ ప్రజల ముందుకు ఆత్మ విశ్వాసంతో రావడం జరిగింది.  
దివికేగిన మహామహులు శ్రీ దివాకర్ల రామమూర్తి గారు, శ్రీ వసంత రావు వేంకట రావు గారు, శ్రీ పాటీలు తిమ్మారెడ్డి గారు తమ ఆశీస్సులను అక్కడి నుండి నేటి యువతరం ప్రదర్శకులకు అందించి ఉంటారనేందుకు ఏమాత్రం సందేహం లేదు.
వైశాఖి క్రీడోద్యాన సంఘం అధ్యక్షులైన
శ్రీ రామకృష్ణా రెడ్డి గారు ఈ కార్యక్రమం తమ ప్రాంగణంలో జరిపించేందుకు మంచి పట్టుదల చూపించారు. 
శ్రీ నందన నామ సంవత్సర ఖగోళ భువన విజయం అనే రూపకాన్ని
శ్రీ చైతన్య విద్యాసంస్థలలో సంస్కృత అధ్యాపకులుగా పని చేస్తున్న శ్రీనివాసకృష్ణ గారు రూపు దిద్దారు.  ప్రదర్శనలో వారు కాలజ్ఞులుగా వ్యవహరించారు.భారతీయవిద్యాకేంద్ర 
కళాశాలలో సంస్కృత విభాగ అధ్యక్షులుగా ఉన్న శ్రీ పిళ్లా రమణ మూర్తి గారు ఈ ప్రదర్శనలో సూర్యునిగా,  శ్రీ చైతన్య విద్యాసంస్థలలో అధ్యాపకులైన శ్రీ కేదారి శెట్టి ఆదినారాయణ గారు చంద్రునిగా, శ్రీ ఖాదర్ వలీ గారు కుజునిగా, శ్రీ బొత్సా తిరుపతి రావు గారు బుధునిగా,  శ్రీ శేషుబాబు గారు గురునిగా వ్యవహరించారు.  ఎన్నారై కళాశాలలో సంస్కృత అధ్యాపకులైన శ్రీ మంగిపూడి కామేశ్వర రావు గారు శుక్రునిగా, శ్రీ త్రినాథం గారు శనైశ్చరునిగా వ్యవహరించారు.
నిర్వాహకులైన వైశాఖి క్రీదోద్యాన సంఘ సభ్యులతో రూపక ప్రదర్శక బృందం 

శ్రీ రామకృష్ణారెడ్డి గారు తమ వైశాఖి క్రీడోద్యాన సంఘం తరపున సంస్కృత అధ్యాపకులందరినీ జ్ఞాపిక తోను, కండువాతోను సత్కరించడం మాత్రమే కాక, నాలుగువేల రూపాయలను పారితోషికంగా సమర్పించారు.  
ఆ విధంగా ఆంధ్ర ప్రదేశ సంస్కృత అధ్యాపక సంఘం, విశాఖపట్టణం వారు ప్రజల సమక్షంలో చేసిన తొలి ప్రదర్శన అత్యంత విజయవంతంగా ముగిసింది.తరువాత ఖగోళ భువన విజయ రూపక ప్రదర్శక బృందం సభ్యులందరూ తమకు వచ్చిన పారితోషికాన్ని ఆంధ్ర ప్రదేశ సంస్కృత అధ్యాపక సంఘానికి విరాళంగా సమర్పిస్తూ, స్పాట్ వాల్యుయేషన్ లో పని చేస్తున్న ఇతర సంఘ సభ్యులందరి సమక్షంలో, సంఘ అధ్యక్షులైన శ్రీ పెద్దిరాజు గారి చేతికి అందించారు. 
సంఘ అధ్యక్షులైన పెద్దిరాజు గారికి తమ పారితోషికాన్ని అందిస్తున్న రూపక ప్రదర్శనకారులు.  చిత్రంలో వరుసగా.. ౧) శ్రీ కామేశ్వర రావు గారు, ౨) శ్రీ తిరుపతి రావు గారు, ౩) శ్రీ శ్రీనివాస కృష్ణ గారు, ౪) శ్రీ పెద్ది రాజు గారు, ౫) శ్రీ త్రినాధ్ గారు, ౬) శ్రీ ఖాదర్ వలీ గారు,  ౭) శ్రీ పిళ్లా రమణ మూర్తి గారు.   (శ్రీ ఆదినారాయణ గారు, శ్రీ శేషుబాబు గారు చిత్రంలో లేరు.)
శ్రీ పెద్దిరాజు గారు సంస్కృత అధ్యాపక సంఘానికి సహాయ కోశాధికారి అయిన శ్రీ గౌరీనాయుడు గారికి ఆ ధనం అందజేసి ఇటువంటి కష్టార్జితమైన ధనమే సంఘానికి శ్రీరామరక్షగా నిలుస్తుందని అన్నారు.  సంస్కృత అధ్యాపక సంఘం,వారు ఇకపై నుండి ఇటువంటి కార్యక్రమాలను ఇతోధికంగా చేస్తూ ప్రజల మెప్పును ఆదరాభిమానాలను పొందవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.  కార్యక్రమాన్ని ఆద్యంతం,తిలకించి పులకించి పోయానని వారు చెప్పారు.
సంఘ సభ్యులు అందరూ ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు ఎంతో సంతోషించారు. 
రూపక ప్రదర్శక బృందాన్ని అభినందించారు.

                     (((((((((((((((((((((((((మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయండి.)))))))))))))))))))))))))
                                        Email: apsla.visakha@gmail.com

Saturday, March 17, 2012

విద్యను గూర్చిన ప్రశంసాశ్లోకాలు కొన్ని...

మహా మాత్రే సరస్వత్యై నమో నమః
విద్యాప్రశంస

౦౧) అపూర్వః కోపి కోశోయం విద్యతే తవ భారతి.
       వ్యయతో వృద్ధిమాయాతి క్షయమాయాతి సంచయాత్..
భావము :  ఓ సరస్వతీదేవీ, నీ చెంత ఉన్నటువంటి నిధి చాల అపూర్వమైనది.  అదేమిటో, విచిత్రం, ఖర్చు పెడుతూ ఉంటే పెరుగుతుంది.  దాచుకుంటే తరుగుతుంది.  (ఆ నిధి పేరే విద్య) 

౦౨) అనేక సంశయోచ్చేది పరోక్షార్థస్య దర్శకం.
       సర్వస్య లోచనం శాస్త్రం యస్య నాస్త్యంధ ఏవ సః..
భావము :  శాస్త్రము అనేక సందేహాలను నివృత్తి చేస్తుంది.  పరోక్షమైన దానిని (మోక్షాన్ని) దర్శింపజేస్తుంది.  ఈ విధంగా శాస్త్రవిద్య ప్రతి ఒక్కరికి నేత్రం వంటిది.  అది లేని వాడు గ్రుడ్డివాడి క్రింద లెక్క.
 
౦౩) సర్వద్రవ్యేషు విద్యైవ ద్రవ్యమాహురనుత్తమం.
      అహార్యత్వాత్ అనర్ఘ్యత్వాత్ అక్షయత్వాత్ చ సర్వదా..
భావము :  అన్ని పదార్థాలలోనూ విద్య అనేది అతి ఉత్తమమైన పదార్థం అని చెప్పబడింది.  ఎందుకంటే అది దొంగిలింపబడదు.  అది విలువ కట్టబడదు.  అది తరిగిపోదు.    


౦౪) హర్తుర్న గోచరం యాతి దత్తా భవతి విస్తృతా.
       కల్పాన్తేపి న వా నశ్యేత్ కిమన్యత్ విద్యయా సమం..
భావము :  విద్య కంటికి కనబడదు.  దానం చేస్తే విస్తారంగా పెరుగుతుంది.  కల్పాంతంలో కూడా నశించేది కాదు.   అందువలన విద్యతో సమానమైనది ఏమున్నది?  (ఏదీ విద్యకు సమానం కాదని అర్థం)
 

౦౫) జ్ఞాతిభిర్న విభజ్యతే నైవ చోరేణాపి న నీయతే.
        దానే నైవ క్షయం యాతి విద్యారత్నం మహద్ధనం..
భావము :  విద్యను జ్ఞాతులు పంచుకొనలేరు.  దొంగలు దీనిని ఎత్తుకొని పోలేరు.  దానం చేసినా ఇది తరగదు.  విద్య అనే రత్నం అతి గొప్పదైన ధనం.


౦౬) విద్యా శస్త్రం చ శాస్త్రం చ ద్వే విద్యే ప్రతిపత్తయే.
       ఆద్యా హాస్యాయ వృద్ధత్వే ద్వితీయాద్రియతే సదా..
జయేంద్రసరస్వతి యతివర్యులతో విజయేంద్రసరస్వతులు

భావము :  శస్త్రవిద్య శాస్త్రవిద్య అని విద్య రెండు విధాలు.  ముసలితనంలో మొదటి విద్య నవ్వులపాలు అవుతుంది.  (ముసలివీరులను ఓడించగల యువవీరులు ఉంటారు.)  రెండవ విద్య ఎల్లప్పుడూ గౌరవింపబడుతుంది. (వృద్ధాప్యం వస్తున్నకొద్దీ శాస్త్ర పండితుడు మరింత మంది యువపండితులకు ఆరాధ్యుడైన గురువుగా మారుతాడు.)






౦౭) శునః పుచ్చమివ వ్యర్థం జీవితం విద్యయా వినా. 
       న గుహ్యగోపనే శక్తం న చ దంశనివారణే..
నా తోకను మనిషి బ్రతుకుతో పోల్చినందుకు చాలా సంతోషం.. 
భావము :  కుక్కకు ఒక తోక ఉంటుంది కాని ఆ తోక దాని రహస్యాన్ని(మల విసర్జక అంగాన్ని) దాచలేదు.  పోనీ దోమలను తోలేందుకు ఉపయోగ పడుతుందా అంటే - అదీ లేదు.  అలాగే, విద్య లేని మనిషి బ్రతుకు కుక్క తోకతో సమానమాట.  (కుక్కకు తోక ఎందుకూ పనికిరాదు.  అదే విధంగా, విద్య లేని మనిషికి అతని బ్రతుకు కూడా ఇహానికి పరానికి దేనికీ పనికి రాదు అని అర్థం.) 

 
౦౯) సద్విద్యా యది కా చింతా వరాకోదరపూరణే.
       శుకోప్యశనమాప్నోతి రామ రామేతి చ బ్రువన్..

భావము :  మనిషికి చక్కని విద్య ఉన్న పక్షంలో; తనకు ఉన్న జానెడు పొట్టను ఎలా నింపుకొనడమా  అనే దిగులు అవసరం లేదు.  చివరకు చిలుక కూడా "రామ" అనే ఒకే ఒక్క పదాన్ని నేర్చుకుని దానిని వల్లె వేస్తుంటే ముచ్చట పడి దాని యజమాని దాని పొట్ట నిండుగా ఆహారం పెడుతున్నాడు కదా. 
 





౧౦) వసుమతీపతినా ను సరస్వతీ 
       బలవతా రిపుణాపి న నీయతే.
       సమవిభాగహరైర్న విభజ్యతే 
       విబుధబోధబుధైరపి సేవ్యతే..
 భావము :  సరస్వతిని  (విద్యను) భూపతి అయిన రాజు లాగుకొనలేడు బలవంతుడైన శత్రువు కూడా లాగుకొనలేడు.  ప్రతి దాంట్లోనూ భాగం పంచుకొనే జ్ఞాతులు కూడా ఈ విద్యను పంచుకొనలేరు.  మహా పండితులు కూడా ఈ విద్యను ఆదరిస్తారు.  (కాబట్టి అటువంటి విద్యను సంపాదించుకోవాలి.)  

౧౧) శ్రియః ప్రదుగ్ధే విపదో రుణద్ధి.
       యశాంసి సూతే మలినం ప్రమార్ష్టి.
       సంస్కారశౌచేన పరం పునీతే 
       శుద్దా హి విద్యా కిల కామధేనుః.. 
కామధేనువు
భావము :  (కామధేనువు పాలను ప్రసాదించే విధంగా...) విద్య   సంపదలను ప్రసాదిస్తుంది.  (కామధేనువు అశుభాలను తొలగించే విధంగా...) విద్య ఆపదలను తొలగిస్తుంది.  (కామధేనువు వత్సాన్ని ప్రసవించే విధంగా...) విద్య కీర్తిని ప్రసవిస్తుంది (కలిగిస్తుంది).  (కామధేనువు తాను నివసించే గృహపరిసరాల మాలిన్యాన్ని దూరం చేసేవిధంగా...) విద్య తనను అభ్యసించే మనిషి యొక్క మనోమాలిన్యాలను చెరిపివేస్తుంది.  కామధేనువు వలెనే  విద్య కూడా పరిశుద్ధమైన సంస్కారాలను కలిగించి ఎంతో పవిత్రతను కలుగజేస్తుంది.  (పరలోకానికి = మోక్షానికి చేరువ చేస్తుంది.)  ఇటువంటి పరిశుద్ధమైన విద్య సాక్షాత్తు కామధేనువే కదా!

౧౨) న చోరహార్యం న చ రాజహార్యం న భ్రాతృభాజ్యం న చ భారకారి.
        వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధనప్రధానం.. 
(నేడు ప్రజలు చదువు "కొంటున్నారు", ఎందుకంటే - అది మంచి పెట్టుబడి అని అందరూ భావిస్తున్నారు కాబట్టి.)
భావము :  విద్య దొంగల చేత దొంగిలింపబడదు.  రాజులు విద్యపై పన్ను వసూలు చేయలేరు.  అన్నదమ్ములు దీనిని పంచుకొనలేరు.  విద్య ఎన్నడూ భారం కాదు.  ఖర్చు పెడుతుంటే విద్య పెరుగుతుంది.  అందువలన అన్ని ధనాలలోనూ విద్య అనే ధనమే ప్రధానమైనది.  

 
౧౩) మాతేవ రక్షతి పితేవ హితే నియుంక్తే
       కాన్తేవ చాభిరమయత్యపనీయ ఖేదం.
       లక్ష్మీం తనోతి వితనోతి చ దిక్షు కీర్తిం
      కిం కిం న సాధయతి కల్పలతేవ విద్యా??
కల్ప వృక్షం - ఒక చిత్రకారుని ఊహాచిత్రం 

భావము :  విద్య తల్లి వలె రక్షిస్తుంది.  తండ్రి వలె మంచి దారిలో నడిపిస్తుంది.  జీవిత భాగస్వామి వలె విచారాన్ని తొలగించి వినోదపరుస్తుంది.  సంపదలను కలిగిస్తుంది.  అన్ని దిక్కులలోనూ కీర్తిని వ్యాపిమ్పజేస్తుంది.  ఈ విధంగా కల్పవృక్షం వంటి విద్య సాధించలేనిది ఏమున్నది?  (విద్యావంతుడు దేనినైనా సాధించగలడు అని అర్థం.)



౧౪) విద్యా నామ నరస్య రూపమధికం ప్రచ్చన్నగుప్తం ధనం
        విద్యా భోగకరీ యశః సుఖకరీ విద్యా గురూణాం గురుః. 
        విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరా దేవతా
        విద్యా రాజసు పూజ్యతే న హి ధనం విద్యావిహీనః పశుః..

 భావము :  విద్య మనిషికి అధికమైన తేజస్సును కలిగిస్తుంది.  విద్య ఒక రహస్యమైన నిధితో సమానం.  విద్య భోగాలను ప్రసాదిస్తుంది.  కీర్తిని, సుఖాన్ని కలిగిస్తుంది.  ఈ విద్య గురువులకే గురువు.  విదేశాలలో మనలను ఆదుకొనే బంధువు విద్యయే.  ఈ విద్య అతి గొప్ప దేవత.  ఈ విద్యను రాజులు కూడా గౌరవిస్తారు.  ఇటువంటి విద్య లేనివాడు పశువుతో సమానం.  (విద్యలేని మనిషికి, ఒక జంతువుకు పెద్ద తేడా ఉండదు)
గాడిదంటేనే మనిషికి లోకువ...
కాని, చదువుకోని మనిషంటే గాడిదకు కూడా లోకువే...


౧౫) విద్యా నామ నరస్య కీర్తిరతులా భాగ్యక్షయే చాశ్రయో
       ధేనుః కామదుఘా రతిశ్చ విరహే నేత్రం తృతీయం చ సా.
       సత్కారాయతనం కులస్య మహిమా రత్నైర్వినా భూషణం
       తస్మాదన్యముపేక్ష్య సర్వవిషయం విద్యాధికారం కురు..
భావము :  విద్య మనిషికి సాటిలేని ఒక కీర్తి.  మిగిలిన సంపదలు నశించిపోయినా విద్య మనిషికి జీవనాధారంగా ఉంటుంది.  విద్య కోరినదానిని ప్రసాదించగల కామధేనువు.  విరహములో (స్వజనానికి స్వదేశానికి ఎంత దూరంలో ఉన్నా) ఆనందాన్ని కలిగించేది విద్య.  ఈ విద్య మనిషికి మూడవ కన్ను.  ఈ విద్య మనిషిని సత్కారానికి (గౌరవానికి) అర్హుడిగా మారుస్తుంది.  ఈ విద్య వలన ఆ విద్యావంతుని కుటుంబానికి కూడా ఔన్నత్యం కలుగుతుంది.  విద్య అనేది ధగ ధగా మెరిసే రత్నాలు లేకున్నా మనిషికి ఆభరణం వంటిది.  కాబట్టి, మిగిలిన అన్ని విషయాలను ఉపేక్షించి, మొదట విద్యపై అధికారం సంపాదించు.  

సేకరణ, భావ రచన:  
శ్రీనివాసకృష్ణ,  శ్రీచైతన్య విద్యాసంస్థలు

మిత్రులకు వినయపూర్వకమైన విన్నపం - 
ఈ బ్లాగులో తెలుగు లిపిలో టైపు చేయడంలో ఉన్న పరిమితుల వలన "సంశయోచ్చేది" మరియు "ప్రచ్చన్న" వంటి పదాలలో ఉండవలసిన వత్తులు వ్రాయడం నాకు సాధ్యం కాలేదు.  అలాగే శ్లోకపాదాల చివర్లలో మకారహలంతం ఎలా వ్రాయాలో (టైపు చేయాలో) తెలియక అనుస్వారం ఉంచడం జరిగింది.  అల్లాగే మొదటి శ్లోకంలోనే కోపి అనే అక్షరాల మధ్యలోను, శుకోప్యశనమాప్నోతి వంటి పదాల మధ్యలోను అకారప్రశ్లేషను ఉంచాలి.  అదెలా చేయడమో తేలియదు,  ఈ పరిమితులను అధిగమించడం ఎలాగో మిత్రులకు ఎవరికైనా తెలిసి ఉంటే, దయచేసి వారు నాకు తెలియజేయవలసిందిగా ప్రార్థన.  అలా తెలియజేస్తే, ఇటువంటి లేఖనదోషాలు తొలగించి, ఇకపై ఇటువంటివి రాకుండా జాగ్రత్త పడుతూ భవిష్యత్తులో నిర్దుష్టంగా వ్రాసేందుకు ప్రయత్నిస్తాను.  

ధన్యవాదాలతో..  మీ శ్రీనివాసకృష్ణ. 
ఈ మెయిల్:  
apsla.visakha@gmail.com లేదా srinivasakrishna1@gmail.com