Tuesday, April 17, 2012

సప్త ధాతువులు


యుక్తే వయసి యః శాన్తః స శాన్తః ఇతి మే మతిః.
దాతుషు క్షీయమాణేషు శమః కస్య న జాయతే?


భావము - యుక్త వయసులో ఎవరైతే ఇంద్రియ నిగ్రహం కలిగి ప్రశాంతంగా ఉంటారో  వారే సహజంగా ఇంద్రియాలపై విజయం సాధించిన వారు అని నా (అనగా కవి యొక్క) అభిప్రాయము.  ధాతువులు క్షీణించిపోతున్న వయసులో ఎవని ఇంద్రియాలు అదుపులో ఉండవు?


సరే, మరి ఇక్కడ ధాతువులు క్షీణించి పోతాయి అన్నారు కదా!  ఏమిటా ధాతువులు అని ప్రశ్న.
ఆయుర్వేదశాస్త్రం మానవశరీరం సప్తధాతుమయం అని చెబుతుంది. 
ఆ సప్త ధాతువులు ఇవి - 
౧)  రసము ౨) రక్తము ౩) మాంసము ౪) మజ్జ ౫) అస్థి ౬) మేధ ౭) శుక్రము
సప్త ధాతువులు 
౧ )  రసము  - మనిషి తీసుకొనే ఆహార పదార్థం రసంగా మారిపోయి శరీరంలోని అన్ని భాగాలను పోషిస్తుంది. 
౨) రక్తము - ఇది రక్తనాళాల గుండా ప్రవహిస్తూ దేహంలోని కణాలన్నిటికీ  కావలసిన ఆక్సిజన్ ను సరఫరా చేస్తుంది. కర్బనాలను గ్రహిస్తుంది. 
ఊపిరితిత్తులలో శుభ్రపరచబడి గుండె ద్వారా మరలా శరీరంలోని వివిధ భాగాలకు ప్రవహిస్తుంది.
౩) మాంసము - హృదయ కండరాలు, వర్తుల కండరాలు, అస్థి కండరాలు - ఇటువంటి వివిధమైన పేర్లతో మాంసం శరీరంలో నిండి ఉంటుంది.
౪) మజ్జ - ఇది ఎముకల కుహరాలలో ఉంటుంది.  మజ్జ నుండే రక్తం ఉద్భవిస్తుంది.
౫) అస్థి - అనగా ఎముక.  ఒక సిమెంటు భవనానికి లోపల ఇనుప రాడ్లు ఏ విధంగా నిలకడను కలిగించి నిలబెడతాయో అదే విధంగా శరీరాన్ని నిలబెట్టేవి ఎముకలు.  
౬) మేధ - అనగా కొవ్వు. శరీరానికి అవసరమైన దానికంటే అధికమైన ఆహారం అందితే అది శరీరంలో కొవ్వుగా మారి నిలవ చేయబడుతుంది.
౭) శుక్రము  - ఇది పునరుత్పత్తికి ఉపయోగపడే ధాతువు.  పురుషులలో శుక్రం అని, స్త్రీలలో శోణితం అని పిలవబడుతుంది.


ఈ ఏడు కాకుండా ఓజస్సు అనే మరొక ధాతువు కూడా ఉందని కొందరు అంటారు.


కాబట్టి - ఇటువంటి ధాతువులన్నీపుష్కలంగా శక్తిమంతంగా ఉన్నపుడే మానవుడు వాటిని అదుపులో పెట్టి మోక్షమార్గాన్ని అన్వేషించి పట్టుకోవాలి.  క్షీణించి పోయిన తరువాత అది ఎలా సాధ్యం?

No comments:

Post a Comment