Saturday, February 4, 2012


प्रिय सोदराः!
౩౧ - ౧౦ - ౨౦౧౦ నాడు హెరిటేజ్ హోటల్ లో సమావేశం కావలసిందిగా విశాఖ లో ఇంటర్మీడియట్ పిల్లలకు వివిధ కళాశాలల్లో సంస్కృతం బోధిస్తున్న అధ్యాపకులందరికీ ఆహ్వానం పంపడం జరిగింది. మొత్తం ముప్ఫై ఐదు మంది వరకు ఈ ఆహ్వానానికి ప్రతిస్పందించారు. విజయవాడ నుండి రాంబాబు గారు, నరసింహాచార్యులు గారు విచ్చేశారు. అసలు ఈ విధంగా విశాఖ లో సమావేశం జరగడానికి మూలకారణమే శ్రీ రాంబాబు గారు. విశాఖలో ఉన్న తమ మిత్రులు శ్రీ వర్మ గారి ద్వారా మరియు శ్రీనివాస కృష్ణ ద్వారా ఈ సమావేశం జరిగేలా చూశారు. ఆ నాడు హెరిటేజ్ హోటల్ లో ఐన మొత్తం ఖర్చులను శ్రీ వర్మ గారే భరించారు.
సమావేశం లో మొదటగా విజయవాడ అప్స్లా వారు ప్రచురించిన సంవిద పత్రికను నారాయణ కళాశాలలో పని చేస్తున్న అధ్యాపకులు శ్రీ పెద్దిరాజు గారు మరియు వర్మ గారు తమ చేతులమీదుగా విడుదల చేశారు.

అనంతరం శ్రీ చైతన్య కళాశాలలో పని చేస్తున్న శ్రీ మూడడ్ల ఉమామహేశ్వర రావు గారు మాట్లాడుతూ ఒకప్పుడు సంస్కృతం చదివినందుకు గర్వించే రోజులు ఉండేవని కాని ఈనాడు అయ్యో మేము సంస్కృతం చదువుకొని పొరబాటు చేశామేమో, అందువల్ల ఈ రోజు పొట్ట గడవడం కూడా కష్టంగా ఉంది అని బాధ పడేలా పరిస్థితులు మారిపోయాయని అన్నారు.

అనంతరం ఎన్ ఆర్ ఐ కళాశాలలో పని చేస్తున్న శ్రీ ఎం కామేశ్వర రావు గారు మాటాడుతూ, ఇంటర్ మీడియట్ సిలబస్ చాలా సులువుగా ఉంటోందని, దానివలన విద్యార్థులకు సంస్కృతభాష పై సరైన అవగాహన కలగటం లేదని చెప్పి ఈ విధమైన సిలబస్ ను అటు విద్యార్థులకు, ఇటు బోధకవర్గానికి, మరో వైపు సమాజానికి కూడా అనుకూలంగా ఉండేలా మార్చాలని అన్నారు.

పిమ్మట శ్రీ చైతన్య కళాశాల లో పని చేస్తున్న శ్రీనివాసకృష్ణ మాటలాడుతూ సంస్కృతం వలన ఎక్కువ మార్కులు తెచ్చుకొనడం ఒకటే ప్రయోజనం అనే భావం అందరిలోనూ నెలకొన్నదని, ఆ పరిస్థితులు పోయి సంస్కృతం పై ఆదరం పెరగాలంటే సంస్కృతం చదువుకున్న వ్యక్తులు ఎంతో సంస్కారవంతులు అవుతారన్న అభిప్రాయం బలపడేలా మనం కృషి చేయాలని అన్నారు.

అనంతరం శ్రీ రాంబాబు గారు మాటాడుతూ మన అందరి అభిప్రాయాలు ఒకటే అని, కాని ఇవన్నీ మనం అమలు చేయాలంటే ఒంటరిగా చేయలేమని, మనం ఒక సంఘంగా ఏర్పడాలని, సంఘే శక్తిః కలౌ యుగే అని మన అమరభాష మనకు ప్రబోధిస్తూ ఉన్నదని, విజయవాడ నగరంలో సంస్కృత అధ్యాపక సంఘం గత ఐదారు సంవత్సరాలుగా చురుకుగా పని చేస్తున్నదని, దానివలన అక్కడి అధ్యాపకులందరిలోనూ మంచి చురుకుదనం, ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్నాయని, అలాగే, విశాఖలో కూడా మీరు ఒక సంఘంగా ఏర్పాటు కావాలని మా ఆకాంక్ష అని, ఇదే విధంగా రాష్ట్రం అంతటా ప్రతి జిల్లాలోనూ సంస్కృత అధ్యాపక సంఘాలు ఏర్పడాలనే ఆశయంతో రాష్ట్రం అంతా పర్యటిస్తూ ఈనాటికి విశాఖ నగరానికి చేరుకున్నామని వివరించారు.


అనంతరం శ్రీ నరసింహాచార్యులు గారు విజయవాడ నగరంలో సంస్కృత అధ్యాపక సంఘం నిర్వర్తిస్తున్న వివిధ కార్యకలాపాలను గూర్చి వివరించారు. ప్రతి శుక్రవారం క్రమం తప్పక సంఘ సమావేశాలు జరుగుతున్నాయని, ఆ సమయంలో వివిధ కావ్యాల చదవడం చెప్పడం జరుగుతోందని, ఆయా సందర్భాలలో పండితులను ఆహ్వానించి వారి సందేశాలను గ్రహించడం జరుగుతోందని, ఇంకా అధ్యాపకులకు వివిధ సందర్భాలలో ఎక్కడైనా తమ విధి నిర్వహణలో ఆటంకాలు ఏర్పడితే అవి అందరం కలసి పరిష్కరించుకుంటున్నాం అని చెప్పారు. మీరు సంఘం గా ఏర్పడిన తరువాత మీరు మేము అనే భేదం లేకుండా మనమంతా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే అనే భావంతో మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం అని చెప్పారు.
తరువాత ఇతర అధ్యాపకులు కూడా కొందరు సంక్షిప్తంగా ప్రసంగించారు. కొందరు తమ సందేహాలను అడిగి సమాధానాలను పొందారు.

తరువాత అల్పాహార విందుతో సమావేశం ముగిసింది. కాని, శ్రీ రాంబాబు, శ్రీ నరసింహాచార్యులు గార్లు చెప్పిన మాటలు విశాఖ అధ్యాపకుల మెదడులనుండి అంత తొందరగా చెరిగిపోయేలా లేవు. వారిని మెచ్చుకుంటూ, చక్కటి వేదికతో పాటు రుచికరమైన విందును ఏర్పాటు చేసిన శ్రీ వర్మ గారికి ధన్యవాదాలు సమర్పిస్తూ, అధ్యాపకులందరూ మరలా ఎప్పుడు సమావేశం అవుదామని చర్చించుకుంటూ తమ తమ ఇళ్ళకు బయలుదేరారు.

No comments:

Post a Comment