Thursday, March 29, 2012

సంస్కృత డాక్టరేట్ లకు శ్రీ వర్మ గారి సత్కారం

              విశాఖపట్నం స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో సంస్కృత సోదరులందరి ఎదుట డాక్టరేట్ సాధించిన సంస్కృత మిత్రులను సన్మానించాలని సంస్థ కోశాధికారి అయిన శ్రీ వర్మ గారు నిశ్చయించుకుని, సంస్థ అధ్యక్షులు అయిన శ్రీ పెద్దిరాజు గారికి ఈ విషయం తెలిపారు.  మార్చ్ నెల 29 వ తేదీన ఆంధ్రప్రదేశ సంస్కృత అధ్యాపక సంఘం ఆధ్వర్యవంలో, ఆర్.ఐ.ఓ. గారి అనుమతితో సభ జరిగింది.


           శ్రీ మూడడ్ల ఉమామహేశ్వర రావు గారి ప్రార్థనతో సభ మొదలైంది.

మొదట సంఘ అధ్యక్షులు శ్రీ పెన్మెత్స పెద్దిరాజు గారు మాటలాడుతూ హైస్కూల్ స్థాయిలో సంస్కృతాన్ని ఒక అధ్యయన విషయంగా ప్రవేశపెట్టవలసిందిగా సంఘం వారు ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని, అందుకు ప్రభుత్వ విద్యారంగం అధికారులు అనుకూలంగా స్పందించి, ఒక్క విశాఖపట్నం జిల్లా లోనే 300 టీచర్ పోస్ట్ లను ఇవ్వగలమని చెప్పారన్నారు.
సంఘ సభ్యులందరూ అందుకు తమ ఆనందాన్ని వ్యక్తం చేయగా పెద్ది రాజు గారు మాత్రం మరి ఈ 300  పోస్ట్ లు వస్తే, వాటినన్నింటిని మనం భర్తీ చేయగలిగిన సంఖ్యలో ఉన్నామా అని మనం ఆత్మ విమర్శ చేసుకొనవలసి ఉంది అని హెచ్చరించారు.  సంస్కృతం చదువుకున్న వారికి సరైన జీవిక లేదనే విచారాన్ని ప్రక్కకు తోసి సంస్కృతం చదివే వారిని ప్రోత్సహించాలని హితవు పలికారు.  
  
పిమ్మట సంఘ గౌరవాధ్యక్షులు శ్రీ పిళ్ళా రమణమూర్తి గారు మాటలాడుతూ, ఈ సంవత్సరం ఆగస్ట్ నెల 19 వ తేదీన విశాఖపట్నం సంస్కృత అధ్యాపక సంఘం వారు రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నామని సంఘసభ్యుల హర్షామోదాల కరతాళధ్వనుల నడుమ ప్రకటించారు.
ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గాను వివిధ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, సభ్యులందరూ తదేక దీక్షతో మహోత్సాహంతో వీటిలో భాగస్వామ్యం వహించాలని కోరారు.  కార్యక్రమనిర్వహణకు నిధులు అవసరమని, నగరంలోని కొందరు వదాన్యులైన దాతలు అందుకు అంగీకరించారని, అయినా, సంఘసభ్యులమైన మనం కూడా తలొక చేయి వేయవలసినదే అని, ఆయన కోరారు.

పిమ్మట సంఘ ఉపాధ్యక్షులైన శ్రీ మూడడ్ల ఉమా మహేశ్వర రావు గారు మాటాడుతూ గత సంవత్సరం నుండి ఇంత వరకు సంఘం చేపట్టిన కార్యక్రమాలను వివరించి, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా, సమయం మించి పోక మునుపే సంఘం దృష్టికి తీసుకురమ్మని,  సంఘ కార్యవర్గ సభ్యులందరూ ఆ సమస్యను పరిష్కరించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారని అందరి కరతాళ ధ్వనుల నడుమ దృఢమ్ గా ప్రకటించారు. 

పిమ్మట డాక్టరేట్ సాధించిన సంఘ సభ్యులకు సత్కారం జరిగింది.  సభలో ఆద్యంతం మౌనంగా చిరునవ్వుతో వేదికపై కూర్చున్న శ్రీ వర్మ గారి వదాన్యత ఈ సత్కారానికి మూల కారణం.  

ఈ సత్కారాన్ని అందుకున్న వారు వరుసగా...


01 ) శ్రీ పోలా ఉమా మహేశ్వర రావు గారు.  శ్రీ చైతన్య కళాశాలలో అధ్యాపకులు.  2005 వ సంవత్సరంలోనే ఆంధ్రవిశ్వవిద్యాలయంలో శ్రీ వేంకటేశ్వర రావు గారి మార్గదర్శకత్వంలో డాక్టరేట్ సాధించారు.  వారి అధ్యయన విషయం "శ్రీమద్భాగవతే పురుషార్థ దృష్ట్యా సుభాషిత విచారః."  


02) శ్రీమతి  చంద్రిక గారు.  2008 వ సంవత్సరంలో నాగార్జున విశ్వ విద్యాలయంలో శ్రీ సత్యనారాయణ రావు గారి మార్గదర్శకత్వంలో డాక్టరేట్ సాధించారు.  వారి అధ్యయన విషయం "భాసనాటకేషు అలంకార పరిపోషణం"  


03) శ్రీమతి  రాజ్యలక్ష్మి గారు.  2010 వ సంవత్సరంలో ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ ఎం.వి. రమణ గారి మార్గదర్శకత్వంలో డాక్టరేట్ సాధించారు.  వారి అధ్యయన విషయం "ఆంధ్రదేశీయానాం సంస్కృతవ్యాఖ్యాసాహిత్యం - ఏకం అధ్యయనం". 


04) శ్రీ పాటీలు శ్రీనివాస కృష్ణ గారుశ్రీ చైతన్య కళాశాలలో అధ్యాపకులు.  2011 వ సంవత్సరంలో (1- 11 - 11 తేదీ)  తిరుపతి నగరంలోని కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయం ఐన రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం లో డాక్టర్ రాణి సదాశివ మూర్తి గారి మార్గదర్శకత్వంలో డాక్టరేట్ సాధించారు.  వారి అధ్యయన విషయం "శ్రీమద్రామాయణే లోకవృత్తస్య అధ్యయనం".

సత్కార గ్రహీతలందరూ సంక్షిప్తంగా తమను తాము పరిచయం చేసుకొని తమ విజయానికి మూలకారకులైన వారిని స్మరించి, తమకు జరిగిన సత్కారానికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి  ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసి సత్కారాన్ని తమ చేతుల మీదుగా జరిపించిన అసిస్టంట్ కేంప్ ఆఫీసర్లు శ్రీ  మల్లికార్జున రావు గారికి మరియు శ్రీ భాస్కర రావు గారికి సంఘ సభ్యులు తమ కృతజ్ఞతలను తెలిపారు.


ఈనాడు వీరికి జరిగిన సత్కారం మరింత మంది సంస్కృత సోదర సోదరీమణులు విద్యారంగంలో ముందు ముందు ఇటువంటి ఘనతలు సాధించేందుకు ప్రేరణ కావాలని శ్రీ వర్మ గారు ఆకాంక్షించారు.
  
 శ్రీ మన్మథ రావు గారి వందన సమర్పణతో సభ ముగిసింది.

No comments:

Post a Comment