Showing posts with label yugadi. Show all posts
Showing posts with label yugadi. Show all posts

Tuesday, August 13, 2013

ద ద ద


అనగా అనగా ప్రజాపతి గారు.  ఆయనకు దేవతలు మానవులు దానవులు అందరూ సంతానమే.

ఆయన సంతానమైన వారందరికీ బ్రహ్మ జ్ఞానం అంటే చాలా గొప్పదని ఒకసారి తెలిసింది.  దాంతో వారు తమ తండ్రిని ఆశ్రయించి అదేమిటో తెలుసుకొనాలని ఉబలాట పడ్డారు.  వారి ఉబలాటం కేవలం తెలుసుకొనడం కోసం మాత్రమే కాదు.  దానిని పాటించి తీరాలనే ఉత్సాహం కూడా వారిలో ఉరకలు వేసింది.       

వారు అందరూ తమ తండ్రి చెంతకు చేరి బ్రహ్మ జ్ఞానం తమకు ప్రసాదించమని అడిగారు.  అది అందరికీ చెప్పేందుకు వీలు లేదు.  మీరందరూ ముందుగా బ్రహ్మచర్యం పాటించండి ఆనక చూద్దాం అని ప్రజాపతి గారు చెప్పారు.  తన సంతానమే కదా అని జాలి పడి అర్హత లేకున్నా పట్టాభిషేకం చేసే మన రాజకీయనాయకుల బాపతు కాదు ఆయన.                      

దాంతో వారందరూ బ్రహ్మచర్యం పాటిస్తూ గొప్ప తపస్సు చేసి అర్హత సంపాదించారు.  

01)
తరువాత దేవతలు మిగిలినవారి కంటే ముందుగానే ప్రజాపతి చెంతకు వచ్చి తమకు ఉపదేశం చేయమని కోరారు.  ప్రజాపతి సంతోషించి వారికి "ద" అనే ఒకే ఒక అక్షరాన్ని ఉపదేశించాడు.  
"నా ఉపదేశం మీకు అర్థమైందా?" అని వారిని అడిగాడు.  "
ఓ! బ్రహ్మాండంగా అర్థమైంది"  అని వారు బదులు చెప్పారు.  
"ఏమి అర్థమైంది?" అని ప్రజాపతి మరలా వారిని అడిగాడు.  
"ద" అనే అక్షరంతో మీరు మాకు "దమం" కలిగి ఉండండి అని ఉపదేశించారు" అని దేవతలు చెప్పారు.  
అది విని ప్రజాపతి సంతోషించాడు. 
"చక్కగా అర్థం చేసుకున్నారు" అని వారిని మెచ్చుకున్నాడు.  
దేవతలు ఆనందపడి ఆ ఉపదేశాన్ని పాటిస్తాం అని వెళ్లిపోయారు. 
(దమం అంటే ఐదు జ్ఞానేంద్రియాల మీద ఐదు కర్మేంద్రియాల మీద అదుపు సాధించడం.)
పంచేంద్రియాలు గుఱ్ఱాల వంటివి.  వాటిని అదుపు చేయగలిగామా , రథం వంటి దేహం చక్కగా పని చేస్తుంది.   వాటిని అదుపు చేయలేక పోయామా, రథం బోల్తా కొట్టినట్టే మన దేహయాత్ర కూడా బోల్తా కొడుతుంది.  అనారోగ్యాలతో తీసుకుని చావవలసిందే మరి.   


02)
తరువాత మానవులు ప్రజాపతి చెంతకు వచ్చి తమకు ఉపదేశం చేయమని కోరారు.  
ప్రజాపతి సంతోషించి వారికి "ద"  అనే ఒకే ఒక అక్షరాన్ని ఉపదేశించాడు.  
"నా ఉపదేశం మీకు అర్థమైందా?" అని వారిని అడిగాడు. 
 "ఓ! బ్రహ్మాండంగా అర్థమైంది"  అని వారు బదులు చెప్పారు.  
"ఏమి అర్థమైంది?" అని ప్రజాపతి మరలా వారిని అడిగాడు. 
"ద" అనే అక్షరంతో మీరు మాకు "దానగుణం" కలిగి ఉండండి అని ఉపదేశించారు" అని మానవులు చెప్పారు.  
అది విని ప్రజాపతి సంతోషించాడు. 
"చక్కగా అర్థం చేసుకున్నారు" అని వారిని మెచ్చుకున్నాడు.  
మానవులు ఆనందపడి ఆ ఉపదేశాన్ని పాటిస్తాం అని వెళ్లిపోయారు.
ఈ ఆధునిక మానవులు గోదానం భూదానం అంటే నమ్మకం లేదంటారు.  సరే కానివ్వండి .  మరి కనీసం రక్తదానం నేత్రదానం లాంటివి కూడా పుణ్యప్రదాలే.  మరి కనీసం వాటినైనా చేయాలి.   నడుం బిగించి ప్రచారం కూడా చేయాలి.       


03)
కాసేపైన తరువాత దానవులు ప్రజాపతి చెంతకు వచ్చి తమకు ఉపదేశం చేయమని కోరారు.  
ప్రజాపతి సంతోషించి వారికి "ద"  అనే ఒకే ఒక అక్షరాన్ని ఉపదేశించాడు.  
"నా ఉపదేశం మీకు అర్థమైందా?" అని వారిని అడిగాడు. 
"ఓ! బ్రహ్మాండంగా అర్థమైంది"  అని వారు బదులు చెప్పారు.  
"ఏమి అర్థమైంది?" అని ప్రజాపతి మరలా వారిని అడిగాడు.  
"ద" అనే అక్షరంతో మీరు మాకు "దయాగుణం" కలిగి ఉండండి అని ఉపదేశించారు" అని దానవులు చెప్పారు. 
 అది విని ప్రజాపతి సంతోషించాడు. 
"చక్కగా అర్థం చేసుకున్నారు" అని వారిని మెచ్చుకున్నాడు.  
దానవులు  ఆనందపడి ఆ ఉపదేశాన్ని పాటిస్తాం అని వెళ్లిపోయారు.
అధమశ్రేణి జంతువులకే దయ ఉన్నపుడు ఉన్నతశ్రేణికి చెందిన ప్రాణి అయిన మానవుడికి దయ ఎందుకు ఉండదు?  

ఇదే ఉపదేశాన్ని మేఘాలు కూడా ఉరుముతూ వినిపిస్తూ ఉంటాయి.  ఆ మేఘాలు "ద ద ద" అని ఉరిమినప్పుడల్లా మనం "ఓహో,  ఇది ప్రజాపతి తన సంతానానికి చేసిన ఉపదేశం కదా" అని మనం గుర్తుతెచ్చుకోవాలి.  కేవలం గుర్తు తెచ్చుకుంటే చాలదు.  ఆ ఉపదేశాలను వారు ఎంత కష్టపడితే సాధించారో!  వాటిని నిత్యం స్మరిస్తూ వాటిని (దమాన్ని, దానగుణాన్ని దయాగుణాన్ని) ఆచరించేందుకు సంకల్పించి సఫలురం కావాలి.

(ఈ కథ బృహదారణ్యక ఉపనిషత్తు లోనిది.  ఇటువంటి ప్రబోధాత్మకమైన కథలు మన ఉపనిషత్తులలో కొల్లలు కొల్లలు.  వీటిని సంస్కృత అధ్యాపకులు చదవాలి లోకానికి అందజేయాలి.  లేకుంటే సంస్కృతం చదివినవారికి చదవనివారికి పెద్ద తేడా ఏముంటుంది?)  


గుంటూరులో రాష్ట్రస్థాయిలో జరుగవలసిన సంస్కృత అధ్యాపకుల సమావేశం ఆంధ్రప్రదేశంలో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిరవధికంగా వాయిదా వేయడం జరిగింది.  ఈ అసౌకర్యానికి క్షంతవ్యులం, అదే విధంగా మీ సౌహార్దతకు వినమ్రులం అని విన్నవించుకుంటున్నాము.  ధన్యవాదాలు.  








Saturday, April 14, 2012

కొన్ని పంచాంగశాస్త్ర విషయములు

శ్రీనందన నామ సంవత్సర ఉగాది నాడు పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది.  ఆ వివరాలు ఈ బ్లాగులోనే ఉన్నాయి.  మీరు వెతికి చూడవచ్చు.  
లేదా ఈ క్రింది లింకును క్లిక్ చేసి చూడవచ్చును:  (http://samvidaapsla.blogspot.in/2012/03/23-03-2012.html)
ఆ సమయంలో కొందరు మిత్రులు కొన్ని ప్రశ్నలను అడిగారు.  
ఆ ప్రశ్నలు, వాటి సమాధానాలు మన సంస్కృత సోదరులకు  మాత్రమే కాక ఆసక్తి ఉన్న ఇతరులకు కూడా ఉపయోగపడతాయని ఇక్కడ పొందుపరుస్తున్నాము. 


ప్రశ్న - అధికమాసాలు ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయో తెలిసింది కానీ, అధిక మాసాలు ఎప్పుడు వస్తాయో తెలుసుకొనడం ఎలా?


సంక్రాంతిముందుగా సంక్రాంతి అంటే ఏమిటో తెలుసుకొంటే దానిని బట్టి తరువాత చెప్పబోయే విషయాలు అర్థమౌతాయి.  సూర్యుడు వివిధరాసులలోనికి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు.  మేషరాశిలోనికి ప్రవేశిస్తే మేషసంక్రమణం లేదా మేషసంక్రాంతి అని,  మకరరాశి లోనికి ప్రవేశిస్తే మకరసంక్రమణం లేదా మకరసంక్రాంతి అని అంటారు.  ఇలా ఒక సంవత్సరంలో సూర్యుడు పన్నెండు రాసులలోనికి ప్రవేశించడం వలన ఒక సంవత్సరంలో పన్నెండు సంక్రాంతులు ఏర్పడతాయి.
      
అధికమాసం - సాధారణంగా ఒక సంక్రాంతి రెండు అమావాస్యల మధ్యలో వస్తుంది.  కాని, రెండు అమావాస్యల నడుమ ఎపుడైతే  సంక్రాంతి ఉండదో ఆ మాసాన్ని అధిక మాసంగా పేర్కొంటారు.  అందువలన ఆ చాంద్రమాన సంవత్సరంలో పదమూడు నెలలు ఉంటాయి.  సాధారణంగా ఇటువంటి పరిస్థితి దాదాపు రెండున్నర సంవత్సరాలకొక సారి జరుగుతుంది.  అందువల్లనే అధిక మాసాలు ప్రతి సంవత్సరం కనబడవు.
      
క్షయమాసం - అయితే, ఒకొక్కసారి రెండు అమావాస్యల మధ్యలో రెండు సంక్రాంతులు ఏర్పడతాయి.  అటువంటి సమయంలో లుప్తమాసం లేదా క్షయ మాసం ఏర్పడుతుంది.  అంటే, ఆ సంవత్సరంలో (చాంద్రమాన  సంవత్సరంలో) పదకొండు నెలలు మాత్రమే ఉంటాయన్న మాట.  ఇటువంటి పరిస్థితి ఏర్పడడం అరుదే కాని అసంభవం మాత్రం కాదు.


     చైత్రం నుండి ఆశ్వయుజం వరకు వచ్చే ఏడు మాసాలలో మాత్రమే సూర్యసంక్రాంతి వచ్చే అవకాశం ఉండదని, అలాగే రెండు సంక్రాంతులు రావడం కార్తిక, మార్గశిర, పుష్యమాసాలలో మాత్రమే జరుగుతుందని లెక్క కట్టారు.  చాంద్రమాన సౌరమానాల మధ్యలో ఈ సంతులతను ఏర్పాటు చేయగలిగిన మన జ్యోతిశ్శాస్త్ర వేత్తలు ఎంతటి మేధావులో మనకు దీని ద్వారా అర్థమౌతుంది.  ఈ విధమైన గణన,  సూక్ష్మపరిశీలన పాశ్చాత్య విద్యను అభ్యసిస్తున్న మన భారతీయ విద్యార్థులకు తెలియజేసే బాధ్యత మనదే.  


ప్రశ్న - ఒక సంవత్సరానికి "ఈ గ్రహం రాజు"  "ఈ గ్రహం మంత్రి" - ఈ విధంగా ఎలా నిర్ణయిస్తారు?


రాజు - ఉగాది పండుగ ఆదివారం నాడు ఏర్పడితే సూర్యుడు రాజు అవుతాడు.  ఇలా - ఉగాది ఏ వారంనాడు ఏర్పడుతుందో ఆ రోజుకు అధిపతి ఆ సంవత్సరానికి రాజు అవుతాడు.


మంత్రి - మేష సంక్రాంతి సోమవారం నాడు ఏర్పడితే చంద్రుడు మంత్రి అవుతాడు.  ఇలా - మేష సంక్రాంతి ఏవారం నాడు ఏర్పడుతుందో ఆ రోజుకు అధిపతి ఆ సంవత్సరానికి మంత్రి అవుతాడు.


సేనాధిపతి  - సింహ సంక్రాంతి మంగళవారం నాడు ఏర్పడితే కుజుడు సేనాధిపతి అవుతాడు.  ఇలా - సింహ సంక్రాంతి ఏవారం నాడు ఏర్పడుతుందో ఆ రోజుకు అధిపతి ఆ సంవత్సరానికి సేనాధిపతి అవుతాడు.



సస్యాధిపతి  - కర్కాటక సంక్రాంతి బుధవారం నాడు ఏర్పడితే బుధుడు సస్యాధిపతి అవుతాడు.  ఇలా - కర్కాటక సంక్రాంతి ఏవారం నాడు ఏర్పడుతుందో ఆ రోజుకు అధిపతి ఆ సంవత్సరానికి సస్యాధిపతి అవుతాడు.


ధాన్యాధిపతి  - ధనుః సంక్రాంతి గురువారం నాడు ఏర్పడితే గురుడు  ధాన్యాధిపతి అవుతాడు.  ఇలా - ధనుః సంక్రాంతి ఏవారం నాడు ఏర్పడుతుందో ఆ రోజుకు అధిపతి ఆ సంవత్సరానికి ధాన్యాధిపతి అవుతాడు.


అర్ఘాధిపతి  - మిథునసంక్రాంతి శుక్రవారం నాడు ఏర్పడితే శుక్రుడు  అర్ఘాధిపతి అవుతాడు.  ఇలా - మిథునసంక్రాంతి ఏవారం నాడు ఏర్పడుతుందో ఆ రోజుకు అధిపతి ఆ సంవత్సరానికి అర్ఘాధిపతి అవుతాడు.


రసాధిపతి  - తులాసంక్రాంతి శనివారం నాడు ఏర్పడితే శనైశ్చరుడు  రసాధిపతి  అవుతాడు.  ఇలా - తులాసంక్రాంతి ఏవారం నాడు ఏర్పడుతుందో ఆ రోజుకు అధిపతి ఆ సంవత్సరానికి రసాధిపతి అవుతాడు.

నీరసాధిపతి  - మకరసంక్రాంతి ఆదివారంనాడు ఏర్పడితే సూర్యుడు నీరసాధిపతి అవుతాడు.  ఇలా - మకరసంక్రాంతి ఏవారం నాడు ఏర్పడుతుందో ఆ రోజుకు అధిపతి ఆ సంవత్సరానికి నీరసాధిపతి అవుతాడు.

మేఘాధిపతి  - సూర్యుడు సోమవారంనాడు ఆర్ద్రా నక్షత్రం లోనికి ప్రవేశిస్తే చంద్రుడు మేఘాధిపతి అవుతాడు.  ఇలా - సూర్యుడు ఏవారం నాడు  ఆర్ద్రా నక్షత్రం  లోనికి ప్రవేశిస్తాడో ఆ రోజుకు అధిపతి ఆ సంవత్సరానికి మేఘాధిపతి అవుతాడు.

ఈ విధంగా ఆధిపత్యాన్ని పొందిన వారిని నవనాయకులు (తొమ్మిది మంది ప్రధాన నాయకులు) అంటారు.  
వీరే ఒక సంవత్సర ఫలితాన్ని ప్రధానంగా శాసిస్తారు.

Friday, March 23, 2012

సంస్కృత అధ్యాపక సంఘం వారి రూపక ప్రదర్శన - "ఖగోళ భువన విజయం"

ఆంధ్రప్రదేశ సంస్కృత అధ్యాపక సంఘం, విశాఖపట్నం శాఖ వారు  23 /03 /2012  నాడు శ్రీనందన నామ సంవత్సర యుగాది సందర్భంగా విశాఖ నగరంలోని మురళీనగర్ కాలనీ లోని వైశాఖి క్రీడోద్యానం లోని విశాల ప్రాంగణంలో పంచాంగశ్రవణ  కార్యక్రమాన్ని నిర్వహించారు.
అయితే, ఈ కార్యక్రమాన్ని"ఖగోళ భువన విజయం" అనే పేరిట ఒక రూపకంగా ప్రదర్శించడం జరిగింది.  ఈ ప్రయోగం క్రొత్తదని అద్భుతంగా ఉందని పలువురు ప్రేక్షకులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.  కాని, ఈవిధమైన కార్యక్రమానికి ఆద్యులు కీర్తి శేషులైన ఆచార్యశ్రీ దివాకర్ల రామ మూర్తి గారు.  వారి ఆధ్వర్యవంలో,  శ్రీ దూర్వాసుల భాస్కరమూర్తి గారి నిర్వహణా దక్షతలో విశాఖపట్నంలోని  శ్రీ కృష్ణాశ్రమంలో, అప్పుడప్పుడు ద్వారకా నగర్ లోని శంకరమఠంలోను, క్వాచిత్కంగా సింహాచల స్వామివారి సమక్షంలోను కూడా పండిత పరిషత్ప్రమోదదాయకంగా నలభై సంవత్సరాలు అవిచ్చిన్నంగా ఈ కార్యక్రమం జరిగిన విషయం నగరంలోని రసజ్ఞులెందరికో తెలిసిన విషయమే.  ఆ కార్యక్రమంలో శ్రీ తెన్నేటి విశ్వనాథం గారు, శ్రీ వసంతరావు వేంకటరావు గారు, శ్రీ పాటీలు తిమ్మారెడ్డి గారు, శ్రీ బంగారేశ్వరశర్మ గారు, శ్రీ కృష్ణమాచార్యులు గారు, కొండేపూడి వేంకట సుబ్బారావు గారు,  మొదలైన మహామహులు ఎందరో పాల్గొని దీని ప్రఖ్యాతికి మూల కారకులయ్యారు.
కాని, దాదాపు 2006  వ సంవత్సరం నుండి ఈ కార్యక్రమం అనివార్య కారణాలవలన నిలిచిపోయింది.  కేవలం నిలిచి పోయింది.  ఆగిపోలేదు.  ఆ తరువాత 2008 వ సంవత్సరంలో శ్రీచైతన్య కళాశాల సంస్కృత అధ్యాపకులు వారి కళాశాలలో ఈ కార్యక్రమం ప్రదర్శించి తమ సహాధ్యాపకుల  మెప్పు పొందారు.  ఆ ధైర్యంతో 2012  ఉగాది నాడు మరలా విశాఖ ప్రజల ముందుకు ఆత్మ విశ్వాసంతో రావడం జరిగింది.  
దివికేగిన మహామహులు శ్రీ దివాకర్ల రామమూర్తి గారు, శ్రీ వసంత రావు వేంకట రావు గారు, శ్రీ పాటీలు తిమ్మారెడ్డి గారు తమ ఆశీస్సులను అక్కడి నుండి నేటి యువతరం ప్రదర్శకులకు అందించి ఉంటారనేందుకు ఏమాత్రం సందేహం లేదు.
వైశాఖి క్రీడోద్యాన సంఘం అధ్యక్షులైన
శ్రీ రామకృష్ణా రెడ్డి గారు ఈ కార్యక్రమం తమ ప్రాంగణంలో జరిపించేందుకు మంచి పట్టుదల చూపించారు. 
శ్రీ నందన నామ సంవత్సర ఖగోళ భువన విజయం అనే రూపకాన్ని
శ్రీ చైతన్య విద్యాసంస్థలలో సంస్కృత అధ్యాపకులుగా పని చేస్తున్న శ్రీనివాసకృష్ణ గారు రూపు దిద్దారు.  ప్రదర్శనలో వారు కాలజ్ఞులుగా వ్యవహరించారు.భారతీయవిద్యాకేంద్ర 
కళాశాలలో సంస్కృత విభాగ అధ్యక్షులుగా ఉన్న శ్రీ పిళ్లా రమణ మూర్తి గారు ఈ ప్రదర్శనలో సూర్యునిగా,  శ్రీ చైతన్య విద్యాసంస్థలలో అధ్యాపకులైన శ్రీ కేదారి శెట్టి ఆదినారాయణ గారు చంద్రునిగా, శ్రీ ఖాదర్ వలీ గారు కుజునిగా, శ్రీ బొత్సా తిరుపతి రావు గారు బుధునిగా,  శ్రీ శేషుబాబు గారు గురునిగా వ్యవహరించారు.  ఎన్నారై కళాశాలలో సంస్కృత అధ్యాపకులైన శ్రీ మంగిపూడి కామేశ్వర రావు గారు శుక్రునిగా, శ్రీ త్రినాథం గారు శనైశ్చరునిగా వ్యవహరించారు.
నిర్వాహకులైన వైశాఖి క్రీదోద్యాన సంఘ సభ్యులతో రూపక ప్రదర్శక బృందం 

శ్రీ రామకృష్ణారెడ్డి గారు తమ వైశాఖి క్రీడోద్యాన సంఘం తరపున సంస్కృత అధ్యాపకులందరినీ జ్ఞాపిక తోను, కండువాతోను సత్కరించడం మాత్రమే కాక, నాలుగువేల రూపాయలను పారితోషికంగా సమర్పించారు.  
ఆ విధంగా ఆంధ్ర ప్రదేశ సంస్కృత అధ్యాపక సంఘం, విశాఖపట్టణం వారు ప్రజల సమక్షంలో చేసిన తొలి ప్రదర్శన అత్యంత విజయవంతంగా ముగిసింది.తరువాత ఖగోళ భువన విజయ రూపక ప్రదర్శక బృందం సభ్యులందరూ తమకు వచ్చిన పారితోషికాన్ని ఆంధ్ర ప్రదేశ సంస్కృత అధ్యాపక సంఘానికి విరాళంగా సమర్పిస్తూ, స్పాట్ వాల్యుయేషన్ లో పని చేస్తున్న ఇతర సంఘ సభ్యులందరి సమక్షంలో, సంఘ అధ్యక్షులైన శ్రీ పెద్దిరాజు గారి చేతికి అందించారు. 
సంఘ అధ్యక్షులైన పెద్దిరాజు గారికి తమ పారితోషికాన్ని అందిస్తున్న రూపక ప్రదర్శనకారులు.  చిత్రంలో వరుసగా.. ౧) శ్రీ కామేశ్వర రావు గారు, ౨) శ్రీ తిరుపతి రావు గారు, ౩) శ్రీ శ్రీనివాస కృష్ణ గారు, ౪) శ్రీ పెద్ది రాజు గారు, ౫) శ్రీ త్రినాధ్ గారు, ౬) శ్రీ ఖాదర్ వలీ గారు,  ౭) శ్రీ పిళ్లా రమణ మూర్తి గారు.   (శ్రీ ఆదినారాయణ గారు, శ్రీ శేషుబాబు గారు చిత్రంలో లేరు.)
శ్రీ పెద్దిరాజు గారు సంస్కృత అధ్యాపక సంఘానికి సహాయ కోశాధికారి అయిన శ్రీ గౌరీనాయుడు గారికి ఆ ధనం అందజేసి ఇటువంటి కష్టార్జితమైన ధనమే సంఘానికి శ్రీరామరక్షగా నిలుస్తుందని అన్నారు.  సంస్కృత అధ్యాపక సంఘం,వారు ఇకపై నుండి ఇటువంటి కార్యక్రమాలను ఇతోధికంగా చేస్తూ ప్రజల మెప్పును ఆదరాభిమానాలను పొందవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.  కార్యక్రమాన్ని ఆద్యంతం,తిలకించి పులకించి పోయానని వారు చెప్పారు.
సంఘ సభ్యులు అందరూ ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు ఎంతో సంతోషించారు. 
రూపక ప్రదర్శక బృందాన్ని అభినందించారు.

                     (((((((((((((((((((((((((మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయండి.)))))))))))))))))))))))))
                                        Email: apsla.visakha@gmail.com