Showing posts with label wisdom. Show all posts
Showing posts with label wisdom. Show all posts

Tuesday, August 13, 2013

ద ద ద


అనగా అనగా ప్రజాపతి గారు.  ఆయనకు దేవతలు మానవులు దానవులు అందరూ సంతానమే.

ఆయన సంతానమైన వారందరికీ బ్రహ్మ జ్ఞానం అంటే చాలా గొప్పదని ఒకసారి తెలిసింది.  దాంతో వారు తమ తండ్రిని ఆశ్రయించి అదేమిటో తెలుసుకొనాలని ఉబలాట పడ్డారు.  వారి ఉబలాటం కేవలం తెలుసుకొనడం కోసం మాత్రమే కాదు.  దానిని పాటించి తీరాలనే ఉత్సాహం కూడా వారిలో ఉరకలు వేసింది.       

వారు అందరూ తమ తండ్రి చెంతకు చేరి బ్రహ్మ జ్ఞానం తమకు ప్రసాదించమని అడిగారు.  అది అందరికీ చెప్పేందుకు వీలు లేదు.  మీరందరూ ముందుగా బ్రహ్మచర్యం పాటించండి ఆనక చూద్దాం అని ప్రజాపతి గారు చెప్పారు.  తన సంతానమే కదా అని జాలి పడి అర్హత లేకున్నా పట్టాభిషేకం చేసే మన రాజకీయనాయకుల బాపతు కాదు ఆయన.                      

దాంతో వారందరూ బ్రహ్మచర్యం పాటిస్తూ గొప్ప తపస్సు చేసి అర్హత సంపాదించారు.  

01)
తరువాత దేవతలు మిగిలినవారి కంటే ముందుగానే ప్రజాపతి చెంతకు వచ్చి తమకు ఉపదేశం చేయమని కోరారు.  ప్రజాపతి సంతోషించి వారికి "ద" అనే ఒకే ఒక అక్షరాన్ని ఉపదేశించాడు.  
"నా ఉపదేశం మీకు అర్థమైందా?" అని వారిని అడిగాడు.  "
ఓ! బ్రహ్మాండంగా అర్థమైంది"  అని వారు బదులు చెప్పారు.  
"ఏమి అర్థమైంది?" అని ప్రజాపతి మరలా వారిని అడిగాడు.  
"ద" అనే అక్షరంతో మీరు మాకు "దమం" కలిగి ఉండండి అని ఉపదేశించారు" అని దేవతలు చెప్పారు.  
అది విని ప్రజాపతి సంతోషించాడు. 
"చక్కగా అర్థం చేసుకున్నారు" అని వారిని మెచ్చుకున్నాడు.  
దేవతలు ఆనందపడి ఆ ఉపదేశాన్ని పాటిస్తాం అని వెళ్లిపోయారు. 
(దమం అంటే ఐదు జ్ఞానేంద్రియాల మీద ఐదు కర్మేంద్రియాల మీద అదుపు సాధించడం.)
పంచేంద్రియాలు గుఱ్ఱాల వంటివి.  వాటిని అదుపు చేయగలిగామా , రథం వంటి దేహం చక్కగా పని చేస్తుంది.   వాటిని అదుపు చేయలేక పోయామా, రథం బోల్తా కొట్టినట్టే మన దేహయాత్ర కూడా బోల్తా కొడుతుంది.  అనారోగ్యాలతో తీసుకుని చావవలసిందే మరి.   


02)
తరువాత మానవులు ప్రజాపతి చెంతకు వచ్చి తమకు ఉపదేశం చేయమని కోరారు.  
ప్రజాపతి సంతోషించి వారికి "ద"  అనే ఒకే ఒక అక్షరాన్ని ఉపదేశించాడు.  
"నా ఉపదేశం మీకు అర్థమైందా?" అని వారిని అడిగాడు. 
 "ఓ! బ్రహ్మాండంగా అర్థమైంది"  అని వారు బదులు చెప్పారు.  
"ఏమి అర్థమైంది?" అని ప్రజాపతి మరలా వారిని అడిగాడు. 
"ద" అనే అక్షరంతో మీరు మాకు "దానగుణం" కలిగి ఉండండి అని ఉపదేశించారు" అని మానవులు చెప్పారు.  
అది విని ప్రజాపతి సంతోషించాడు. 
"చక్కగా అర్థం చేసుకున్నారు" అని వారిని మెచ్చుకున్నాడు.  
మానవులు ఆనందపడి ఆ ఉపదేశాన్ని పాటిస్తాం అని వెళ్లిపోయారు.
ఈ ఆధునిక మానవులు గోదానం భూదానం అంటే నమ్మకం లేదంటారు.  సరే కానివ్వండి .  మరి కనీసం రక్తదానం నేత్రదానం లాంటివి కూడా పుణ్యప్రదాలే.  మరి కనీసం వాటినైనా చేయాలి.   నడుం బిగించి ప్రచారం కూడా చేయాలి.       


03)
కాసేపైన తరువాత దానవులు ప్రజాపతి చెంతకు వచ్చి తమకు ఉపదేశం చేయమని కోరారు.  
ప్రజాపతి సంతోషించి వారికి "ద"  అనే ఒకే ఒక అక్షరాన్ని ఉపదేశించాడు.  
"నా ఉపదేశం మీకు అర్థమైందా?" అని వారిని అడిగాడు. 
"ఓ! బ్రహ్మాండంగా అర్థమైంది"  అని వారు బదులు చెప్పారు.  
"ఏమి అర్థమైంది?" అని ప్రజాపతి మరలా వారిని అడిగాడు.  
"ద" అనే అక్షరంతో మీరు మాకు "దయాగుణం" కలిగి ఉండండి అని ఉపదేశించారు" అని దానవులు చెప్పారు. 
 అది విని ప్రజాపతి సంతోషించాడు. 
"చక్కగా అర్థం చేసుకున్నారు" అని వారిని మెచ్చుకున్నాడు.  
దానవులు  ఆనందపడి ఆ ఉపదేశాన్ని పాటిస్తాం అని వెళ్లిపోయారు.
అధమశ్రేణి జంతువులకే దయ ఉన్నపుడు ఉన్నతశ్రేణికి చెందిన ప్రాణి అయిన మానవుడికి దయ ఎందుకు ఉండదు?  

ఇదే ఉపదేశాన్ని మేఘాలు కూడా ఉరుముతూ వినిపిస్తూ ఉంటాయి.  ఆ మేఘాలు "ద ద ద" అని ఉరిమినప్పుడల్లా మనం "ఓహో,  ఇది ప్రజాపతి తన సంతానానికి చేసిన ఉపదేశం కదా" అని మనం గుర్తుతెచ్చుకోవాలి.  కేవలం గుర్తు తెచ్చుకుంటే చాలదు.  ఆ ఉపదేశాలను వారు ఎంత కష్టపడితే సాధించారో!  వాటిని నిత్యం స్మరిస్తూ వాటిని (దమాన్ని, దానగుణాన్ని దయాగుణాన్ని) ఆచరించేందుకు సంకల్పించి సఫలురం కావాలి.

(ఈ కథ బృహదారణ్యక ఉపనిషత్తు లోనిది.  ఇటువంటి ప్రబోధాత్మకమైన కథలు మన ఉపనిషత్తులలో కొల్లలు కొల్లలు.  వీటిని సంస్కృత అధ్యాపకులు చదవాలి లోకానికి అందజేయాలి.  లేకుంటే సంస్కృతం చదివినవారికి చదవనివారికి పెద్ద తేడా ఏముంటుంది?)  


గుంటూరులో రాష్ట్రస్థాయిలో జరుగవలసిన సంస్కృత అధ్యాపకుల సమావేశం ఆంధ్రప్రదేశంలో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిరవధికంగా వాయిదా వేయడం జరిగింది.  ఈ అసౌకర్యానికి క్షంతవ్యులం, అదే విధంగా మీ సౌహార్దతకు వినమ్రులం అని విన్నవించుకుంటున్నాము.  ధన్యవాదాలు.  








Saturday, April 14, 2012

కొన్ని పంచాంగశాస్త్ర విషయములు

శ్రీనందన నామ సంవత్సర ఉగాది నాడు పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది.  ఆ వివరాలు ఈ బ్లాగులోనే ఉన్నాయి.  మీరు వెతికి చూడవచ్చు.  
లేదా ఈ క్రింది లింకును క్లిక్ చేసి చూడవచ్చును:  (http://samvidaapsla.blogspot.in/2012/03/23-03-2012.html)
ఆ సమయంలో కొందరు మిత్రులు కొన్ని ప్రశ్నలను అడిగారు.  
ఆ ప్రశ్నలు, వాటి సమాధానాలు మన సంస్కృత సోదరులకు  మాత్రమే కాక ఆసక్తి ఉన్న ఇతరులకు కూడా ఉపయోగపడతాయని ఇక్కడ పొందుపరుస్తున్నాము. 


ప్రశ్న - అధికమాసాలు ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయో తెలిసింది కానీ, అధిక మాసాలు ఎప్పుడు వస్తాయో తెలుసుకొనడం ఎలా?


సంక్రాంతిముందుగా సంక్రాంతి అంటే ఏమిటో తెలుసుకొంటే దానిని బట్టి తరువాత చెప్పబోయే విషయాలు అర్థమౌతాయి.  సూర్యుడు వివిధరాసులలోనికి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు.  మేషరాశిలోనికి ప్రవేశిస్తే మేషసంక్రమణం లేదా మేషసంక్రాంతి అని,  మకరరాశి లోనికి ప్రవేశిస్తే మకరసంక్రమణం లేదా మకరసంక్రాంతి అని అంటారు.  ఇలా ఒక సంవత్సరంలో సూర్యుడు పన్నెండు రాసులలోనికి ప్రవేశించడం వలన ఒక సంవత్సరంలో పన్నెండు సంక్రాంతులు ఏర్పడతాయి.
      
అధికమాసం - సాధారణంగా ఒక సంక్రాంతి రెండు అమావాస్యల మధ్యలో వస్తుంది.  కాని, రెండు అమావాస్యల నడుమ ఎపుడైతే  సంక్రాంతి ఉండదో ఆ మాసాన్ని అధిక మాసంగా పేర్కొంటారు.  అందువలన ఆ చాంద్రమాన సంవత్సరంలో పదమూడు నెలలు ఉంటాయి.  సాధారణంగా ఇటువంటి పరిస్థితి దాదాపు రెండున్నర సంవత్సరాలకొక సారి జరుగుతుంది.  అందువల్లనే అధిక మాసాలు ప్రతి సంవత్సరం కనబడవు.
      
క్షయమాసం - అయితే, ఒకొక్కసారి రెండు అమావాస్యల మధ్యలో రెండు సంక్రాంతులు ఏర్పడతాయి.  అటువంటి సమయంలో లుప్తమాసం లేదా క్షయ మాసం ఏర్పడుతుంది.  అంటే, ఆ సంవత్సరంలో (చాంద్రమాన  సంవత్సరంలో) పదకొండు నెలలు మాత్రమే ఉంటాయన్న మాట.  ఇటువంటి పరిస్థితి ఏర్పడడం అరుదే కాని అసంభవం మాత్రం కాదు.


     చైత్రం నుండి ఆశ్వయుజం వరకు వచ్చే ఏడు మాసాలలో మాత్రమే సూర్యసంక్రాంతి వచ్చే అవకాశం ఉండదని, అలాగే రెండు సంక్రాంతులు రావడం కార్తిక, మార్గశిర, పుష్యమాసాలలో మాత్రమే జరుగుతుందని లెక్క కట్టారు.  చాంద్రమాన సౌరమానాల మధ్యలో ఈ సంతులతను ఏర్పాటు చేయగలిగిన మన జ్యోతిశ్శాస్త్ర వేత్తలు ఎంతటి మేధావులో మనకు దీని ద్వారా అర్థమౌతుంది.  ఈ విధమైన గణన,  సూక్ష్మపరిశీలన పాశ్చాత్య విద్యను అభ్యసిస్తున్న మన భారతీయ విద్యార్థులకు తెలియజేసే బాధ్యత మనదే.  


ప్రశ్న - ఒక సంవత్సరానికి "ఈ గ్రహం రాజు"  "ఈ గ్రహం మంత్రి" - ఈ విధంగా ఎలా నిర్ణయిస్తారు?


రాజు - ఉగాది పండుగ ఆదివారం నాడు ఏర్పడితే సూర్యుడు రాజు అవుతాడు.  ఇలా - ఉగాది ఏ వారంనాడు ఏర్పడుతుందో ఆ రోజుకు అధిపతి ఆ సంవత్సరానికి రాజు అవుతాడు.


మంత్రి - మేష సంక్రాంతి సోమవారం నాడు ఏర్పడితే చంద్రుడు మంత్రి అవుతాడు.  ఇలా - మేష సంక్రాంతి ఏవారం నాడు ఏర్పడుతుందో ఆ రోజుకు అధిపతి ఆ సంవత్సరానికి మంత్రి అవుతాడు.


సేనాధిపతి  - సింహ సంక్రాంతి మంగళవారం నాడు ఏర్పడితే కుజుడు సేనాధిపతి అవుతాడు.  ఇలా - సింహ సంక్రాంతి ఏవారం నాడు ఏర్పడుతుందో ఆ రోజుకు అధిపతి ఆ సంవత్సరానికి సేనాధిపతి అవుతాడు.



సస్యాధిపతి  - కర్కాటక సంక్రాంతి బుధవారం నాడు ఏర్పడితే బుధుడు సస్యాధిపతి అవుతాడు.  ఇలా - కర్కాటక సంక్రాంతి ఏవారం నాడు ఏర్పడుతుందో ఆ రోజుకు అధిపతి ఆ సంవత్సరానికి సస్యాధిపతి అవుతాడు.


ధాన్యాధిపతి  - ధనుః సంక్రాంతి గురువారం నాడు ఏర్పడితే గురుడు  ధాన్యాధిపతి అవుతాడు.  ఇలా - ధనుః సంక్రాంతి ఏవారం నాడు ఏర్పడుతుందో ఆ రోజుకు అధిపతి ఆ సంవత్సరానికి ధాన్యాధిపతి అవుతాడు.


అర్ఘాధిపతి  - మిథునసంక్రాంతి శుక్రవారం నాడు ఏర్పడితే శుక్రుడు  అర్ఘాధిపతి అవుతాడు.  ఇలా - మిథునసంక్రాంతి ఏవారం నాడు ఏర్పడుతుందో ఆ రోజుకు అధిపతి ఆ సంవత్సరానికి అర్ఘాధిపతి అవుతాడు.


రసాధిపతి  - తులాసంక్రాంతి శనివారం నాడు ఏర్పడితే శనైశ్చరుడు  రసాధిపతి  అవుతాడు.  ఇలా - తులాసంక్రాంతి ఏవారం నాడు ఏర్పడుతుందో ఆ రోజుకు అధిపతి ఆ సంవత్సరానికి రసాధిపతి అవుతాడు.

నీరసాధిపతి  - మకరసంక్రాంతి ఆదివారంనాడు ఏర్పడితే సూర్యుడు నీరసాధిపతి అవుతాడు.  ఇలా - మకరసంక్రాంతి ఏవారం నాడు ఏర్పడుతుందో ఆ రోజుకు అధిపతి ఆ సంవత్సరానికి నీరసాధిపతి అవుతాడు.

మేఘాధిపతి  - సూర్యుడు సోమవారంనాడు ఆర్ద్రా నక్షత్రం లోనికి ప్రవేశిస్తే చంద్రుడు మేఘాధిపతి అవుతాడు.  ఇలా - సూర్యుడు ఏవారం నాడు  ఆర్ద్రా నక్షత్రం  లోనికి ప్రవేశిస్తాడో ఆ రోజుకు అధిపతి ఆ సంవత్సరానికి మేఘాధిపతి అవుతాడు.

ఈ విధంగా ఆధిపత్యాన్ని పొందిన వారిని నవనాయకులు (తొమ్మిది మంది ప్రధాన నాయకులు) అంటారు.  
వీరే ఒక సంవత్సర ఫలితాన్ని ప్రధానంగా శాసిస్తారు.

Saturday, March 17, 2012

విద్యను గూర్చిన ప్రశంసాశ్లోకాలు కొన్ని...

మహా మాత్రే సరస్వత్యై నమో నమః
విద్యాప్రశంస

౦౧) అపూర్వః కోపి కోశోయం విద్యతే తవ భారతి.
       వ్యయతో వృద్ధిమాయాతి క్షయమాయాతి సంచయాత్..
భావము :  ఓ సరస్వతీదేవీ, నీ చెంత ఉన్నటువంటి నిధి చాల అపూర్వమైనది.  అదేమిటో, విచిత్రం, ఖర్చు పెడుతూ ఉంటే పెరుగుతుంది.  దాచుకుంటే తరుగుతుంది.  (ఆ నిధి పేరే విద్య) 

౦౨) అనేక సంశయోచ్చేది పరోక్షార్థస్య దర్శకం.
       సర్వస్య లోచనం శాస్త్రం యస్య నాస్త్యంధ ఏవ సః..
భావము :  శాస్త్రము అనేక సందేహాలను నివృత్తి చేస్తుంది.  పరోక్షమైన దానిని (మోక్షాన్ని) దర్శింపజేస్తుంది.  ఈ విధంగా శాస్త్రవిద్య ప్రతి ఒక్కరికి నేత్రం వంటిది.  అది లేని వాడు గ్రుడ్డివాడి క్రింద లెక్క.
 
౦౩) సర్వద్రవ్యేషు విద్యైవ ద్రవ్యమాహురనుత్తమం.
      అహార్యత్వాత్ అనర్ఘ్యత్వాత్ అక్షయత్వాత్ చ సర్వదా..
భావము :  అన్ని పదార్థాలలోనూ విద్య అనేది అతి ఉత్తమమైన పదార్థం అని చెప్పబడింది.  ఎందుకంటే అది దొంగిలింపబడదు.  అది విలువ కట్టబడదు.  అది తరిగిపోదు.    


౦౪) హర్తుర్న గోచరం యాతి దత్తా భవతి విస్తృతా.
       కల్పాన్తేపి న వా నశ్యేత్ కిమన్యత్ విద్యయా సమం..
భావము :  విద్య కంటికి కనబడదు.  దానం చేస్తే విస్తారంగా పెరుగుతుంది.  కల్పాంతంలో కూడా నశించేది కాదు.   అందువలన విద్యతో సమానమైనది ఏమున్నది?  (ఏదీ విద్యకు సమానం కాదని అర్థం)
 

౦౫) జ్ఞాతిభిర్న విభజ్యతే నైవ చోరేణాపి న నీయతే.
        దానే నైవ క్షయం యాతి విద్యారత్నం మహద్ధనం..
భావము :  విద్యను జ్ఞాతులు పంచుకొనలేరు.  దొంగలు దీనిని ఎత్తుకొని పోలేరు.  దానం చేసినా ఇది తరగదు.  విద్య అనే రత్నం అతి గొప్పదైన ధనం.


౦౬) విద్యా శస్త్రం చ శాస్త్రం చ ద్వే విద్యే ప్రతిపత్తయే.
       ఆద్యా హాస్యాయ వృద్ధత్వే ద్వితీయాద్రియతే సదా..
జయేంద్రసరస్వతి యతివర్యులతో విజయేంద్రసరస్వతులు

భావము :  శస్త్రవిద్య శాస్త్రవిద్య అని విద్య రెండు విధాలు.  ముసలితనంలో మొదటి విద్య నవ్వులపాలు అవుతుంది.  (ముసలివీరులను ఓడించగల యువవీరులు ఉంటారు.)  రెండవ విద్య ఎల్లప్పుడూ గౌరవింపబడుతుంది. (వృద్ధాప్యం వస్తున్నకొద్దీ శాస్త్ర పండితుడు మరింత మంది యువపండితులకు ఆరాధ్యుడైన గురువుగా మారుతాడు.)






౦౭) శునః పుచ్చమివ వ్యర్థం జీవితం విద్యయా వినా. 
       న గుహ్యగోపనే శక్తం న చ దంశనివారణే..
నా తోకను మనిషి బ్రతుకుతో పోల్చినందుకు చాలా సంతోషం.. 
భావము :  కుక్కకు ఒక తోక ఉంటుంది కాని ఆ తోక దాని రహస్యాన్ని(మల విసర్జక అంగాన్ని) దాచలేదు.  పోనీ దోమలను తోలేందుకు ఉపయోగ పడుతుందా అంటే - అదీ లేదు.  అలాగే, విద్య లేని మనిషి బ్రతుకు కుక్క తోకతో సమానమాట.  (కుక్కకు తోక ఎందుకూ పనికిరాదు.  అదే విధంగా, విద్య లేని మనిషికి అతని బ్రతుకు కూడా ఇహానికి పరానికి దేనికీ పనికి రాదు అని అర్థం.) 

 
౦౯) సద్విద్యా యది కా చింతా వరాకోదరపూరణే.
       శుకోప్యశనమాప్నోతి రామ రామేతి చ బ్రువన్..

భావము :  మనిషికి చక్కని విద్య ఉన్న పక్షంలో; తనకు ఉన్న జానెడు పొట్టను ఎలా నింపుకొనడమా  అనే దిగులు అవసరం లేదు.  చివరకు చిలుక కూడా "రామ" అనే ఒకే ఒక్క పదాన్ని నేర్చుకుని దానిని వల్లె వేస్తుంటే ముచ్చట పడి దాని యజమాని దాని పొట్ట నిండుగా ఆహారం పెడుతున్నాడు కదా. 
 





౧౦) వసుమతీపతినా ను సరస్వతీ 
       బలవతా రిపుణాపి న నీయతే.
       సమవిభాగహరైర్న విభజ్యతే 
       విబుధబోధబుధైరపి సేవ్యతే..
 భావము :  సరస్వతిని  (విద్యను) భూపతి అయిన రాజు లాగుకొనలేడు బలవంతుడైన శత్రువు కూడా లాగుకొనలేడు.  ప్రతి దాంట్లోనూ భాగం పంచుకొనే జ్ఞాతులు కూడా ఈ విద్యను పంచుకొనలేరు.  మహా పండితులు కూడా ఈ విద్యను ఆదరిస్తారు.  (కాబట్టి అటువంటి విద్యను సంపాదించుకోవాలి.)  

౧౧) శ్రియః ప్రదుగ్ధే విపదో రుణద్ధి.
       యశాంసి సూతే మలినం ప్రమార్ష్టి.
       సంస్కారశౌచేన పరం పునీతే 
       శుద్దా హి విద్యా కిల కామధేనుః.. 
కామధేనువు
భావము :  (కామధేనువు పాలను ప్రసాదించే విధంగా...) విద్య   సంపదలను ప్రసాదిస్తుంది.  (కామధేనువు అశుభాలను తొలగించే విధంగా...) విద్య ఆపదలను తొలగిస్తుంది.  (కామధేనువు వత్సాన్ని ప్రసవించే విధంగా...) విద్య కీర్తిని ప్రసవిస్తుంది (కలిగిస్తుంది).  (కామధేనువు తాను నివసించే గృహపరిసరాల మాలిన్యాన్ని దూరం చేసేవిధంగా...) విద్య తనను అభ్యసించే మనిషి యొక్క మనోమాలిన్యాలను చెరిపివేస్తుంది.  కామధేనువు వలెనే  విద్య కూడా పరిశుద్ధమైన సంస్కారాలను కలిగించి ఎంతో పవిత్రతను కలుగజేస్తుంది.  (పరలోకానికి = మోక్షానికి చేరువ చేస్తుంది.)  ఇటువంటి పరిశుద్ధమైన విద్య సాక్షాత్తు కామధేనువే కదా!

౧౨) న చోరహార్యం న చ రాజహార్యం న భ్రాతృభాజ్యం న చ భారకారి.
        వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధనప్రధానం.. 
(నేడు ప్రజలు చదువు "కొంటున్నారు", ఎందుకంటే - అది మంచి పెట్టుబడి అని అందరూ భావిస్తున్నారు కాబట్టి.)
భావము :  విద్య దొంగల చేత దొంగిలింపబడదు.  రాజులు విద్యపై పన్ను వసూలు చేయలేరు.  అన్నదమ్ములు దీనిని పంచుకొనలేరు.  విద్య ఎన్నడూ భారం కాదు.  ఖర్చు పెడుతుంటే విద్య పెరుగుతుంది.  అందువలన అన్ని ధనాలలోనూ విద్య అనే ధనమే ప్రధానమైనది.  

 
౧౩) మాతేవ రక్షతి పితేవ హితే నియుంక్తే
       కాన్తేవ చాభిరమయత్యపనీయ ఖేదం.
       లక్ష్మీం తనోతి వితనోతి చ దిక్షు కీర్తిం
      కిం కిం న సాధయతి కల్పలతేవ విద్యా??
కల్ప వృక్షం - ఒక చిత్రకారుని ఊహాచిత్రం 

భావము :  విద్య తల్లి వలె రక్షిస్తుంది.  తండ్రి వలె మంచి దారిలో నడిపిస్తుంది.  జీవిత భాగస్వామి వలె విచారాన్ని తొలగించి వినోదపరుస్తుంది.  సంపదలను కలిగిస్తుంది.  అన్ని దిక్కులలోనూ కీర్తిని వ్యాపిమ్పజేస్తుంది.  ఈ విధంగా కల్పవృక్షం వంటి విద్య సాధించలేనిది ఏమున్నది?  (విద్యావంతుడు దేనినైనా సాధించగలడు అని అర్థం.)



౧౪) విద్యా నామ నరస్య రూపమధికం ప్రచ్చన్నగుప్తం ధనం
        విద్యా భోగకరీ యశః సుఖకరీ విద్యా గురూణాం గురుః. 
        విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరా దేవతా
        విద్యా రాజసు పూజ్యతే న హి ధనం విద్యావిహీనః పశుః..

 భావము :  విద్య మనిషికి అధికమైన తేజస్సును కలిగిస్తుంది.  విద్య ఒక రహస్యమైన నిధితో సమానం.  విద్య భోగాలను ప్రసాదిస్తుంది.  కీర్తిని, సుఖాన్ని కలిగిస్తుంది.  ఈ విద్య గురువులకే గురువు.  విదేశాలలో మనలను ఆదుకొనే బంధువు విద్యయే.  ఈ విద్య అతి గొప్ప దేవత.  ఈ విద్యను రాజులు కూడా గౌరవిస్తారు.  ఇటువంటి విద్య లేనివాడు పశువుతో సమానం.  (విద్యలేని మనిషికి, ఒక జంతువుకు పెద్ద తేడా ఉండదు)
గాడిదంటేనే మనిషికి లోకువ...
కాని, చదువుకోని మనిషంటే గాడిదకు కూడా లోకువే...


౧౫) విద్యా నామ నరస్య కీర్తిరతులా భాగ్యక్షయే చాశ్రయో
       ధేనుః కామదుఘా రతిశ్చ విరహే నేత్రం తృతీయం చ సా.
       సత్కారాయతనం కులస్య మహిమా రత్నైర్వినా భూషణం
       తస్మాదన్యముపేక్ష్య సర్వవిషయం విద్యాధికారం కురు..
భావము :  విద్య మనిషికి సాటిలేని ఒక కీర్తి.  మిగిలిన సంపదలు నశించిపోయినా విద్య మనిషికి జీవనాధారంగా ఉంటుంది.  విద్య కోరినదానిని ప్రసాదించగల కామధేనువు.  విరహములో (స్వజనానికి స్వదేశానికి ఎంత దూరంలో ఉన్నా) ఆనందాన్ని కలిగించేది విద్య.  ఈ విద్య మనిషికి మూడవ కన్ను.  ఈ విద్య మనిషిని సత్కారానికి (గౌరవానికి) అర్హుడిగా మారుస్తుంది.  ఈ విద్య వలన ఆ విద్యావంతుని కుటుంబానికి కూడా ఔన్నత్యం కలుగుతుంది.  విద్య అనేది ధగ ధగా మెరిసే రత్నాలు లేకున్నా మనిషికి ఆభరణం వంటిది.  కాబట్టి, మిగిలిన అన్ని విషయాలను ఉపేక్షించి, మొదట విద్యపై అధికారం సంపాదించు.  

సేకరణ, భావ రచన:  
శ్రీనివాసకృష్ణ,  శ్రీచైతన్య విద్యాసంస్థలు

మిత్రులకు వినయపూర్వకమైన విన్నపం - 
ఈ బ్లాగులో తెలుగు లిపిలో టైపు చేయడంలో ఉన్న పరిమితుల వలన "సంశయోచ్చేది" మరియు "ప్రచ్చన్న" వంటి పదాలలో ఉండవలసిన వత్తులు వ్రాయడం నాకు సాధ్యం కాలేదు.  అలాగే శ్లోకపాదాల చివర్లలో మకారహలంతం ఎలా వ్రాయాలో (టైపు చేయాలో) తెలియక అనుస్వారం ఉంచడం జరిగింది.  అల్లాగే మొదటి శ్లోకంలోనే కోపి అనే అక్షరాల మధ్యలోను, శుకోప్యశనమాప్నోతి వంటి పదాల మధ్యలోను అకారప్రశ్లేషను ఉంచాలి.  అదెలా చేయడమో తేలియదు,  ఈ పరిమితులను అధిగమించడం ఎలాగో మిత్రులకు ఎవరికైనా తెలిసి ఉంటే, దయచేసి వారు నాకు తెలియజేయవలసిందిగా ప్రార్థన.  అలా తెలియజేస్తే, ఇటువంటి లేఖనదోషాలు తొలగించి, ఇకపై ఇటువంటివి రాకుండా జాగ్రత్త పడుతూ భవిష్యత్తులో నిర్దుష్టంగా వ్రాసేందుకు ప్రయత్నిస్తాను.  

ధన్యవాదాలతో..  మీ శ్రీనివాసకృష్ణ. 
ఈ మెయిల్:  
apsla.visakha@gmail.com లేదా srinivasakrishna1@gmail.com